ఏకంగా ఉద్యోగం నుంచే కాకర్ల డిస్మిస్.. కక్ష సాధింపేనా..?

ఏకంగా ఉద్యోగం నుంచే కాకర్ల డిస్మిస్.. కక్ష సాధింపేనా..?

Summarize with AI

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర రాజకీయాల్లో ‘రెడ్ బుక్ పాలన’ (Red Book Rule) చర్చ కొనసాగుతుండగానే, తాజాగా మరో సంచలన నిర్ణయం వెలువడింది. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా, సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడిగా పనిచేసిన కాకర్ల వెంకట్రామిరెడ్డిని (Kakarla Venkataramireddy) చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Government) ఏకంగా సర్వీసు నుండి శాశ్వతంగా తొలగిస్తూ (Dismiss) ఉత్తర్వులు జారీ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు నాడే ఈ కీలక నిర్ణయం వెలువడటం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది.

ప్రశ్నించినందుకే ఈ శిక్షా?
సచివాలయంలో (Secretariat) అసిస్టెంట్ సెక్రటరీగా (Assistant Secretary) పనిచేస్తున్న వెంకట్రామిరెడ్డిపై చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచే వేటు మొదలైంది. తొలుత ఆయనను సస్పెన్షన్ వేటు వేసిన ప్రభుత్వం, ఇప్పుడు ఏకంగా ఉద్యోగం నుంచే బర్తరఫ్ చేసింది. అయితే, ఈ చర్య వెనుక రాజకీయ కక్ష సాధింపు ఉందని ఉద్యోగ వర్గాలు ఆరోపిస్తున్నాయి. గత 22 నెలలుగా ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిలదీస్తున్నందుకే ఆయనను లక్ష్యంగా చేసుకున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

వరుస సస్పెన్షన్ల పర్వం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ విధానాలను విమర్శించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో అమరావతిపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడన్న కారణంతో ఒక ఉద్యోగిని సస్పెండ్ చేశారు. ఇటీవల ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పోస్ట్ పెట్టినందుకు ఒక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై కూడా వేటు పడింది. ఈ క్రమంలో ఇప్పుడు ఏకంగా ఒక కీలక ఉద్యోగ సంఘం నాయకుడిని డిస్మిస్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది.

చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా..
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక ఉద్యోగ నేతపై ప్రభుత్వం ఇలా పగపట్టడం ఏంటని ప్రతిపక్షాలు, ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. చంద్రబాబు మోసాన్ని ఎండగడుతున్నారనే అక్కసుతోనే వెంకట్రామిరెడ్డిపై ఈ ‘రెడ్ బుక్’ ప్రతాపం చూపారని ప్ర‌తిప‌క్షాలు విమర్శిస్తున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తిని కక్ష గట్టి ఉద్యోగం నుండి తొలగించడం ద్వారా మిగిలిన ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేయడమే ప్రభుత్వ ఉద్దేశమని వారు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ బర్తరఫ్ ఉత్తర్వులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులలో చర్చనీయాంశంగా మారాయి. దీనిపై వెంకట్రామిరెడ్డి న్యాయపోరాటం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Join WhatsApp

Join Now

Leave a Comment