జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌పై ‘ప్రైవేటు ప‌డ‌గ‌’

జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌పై 'ప్రైవేటు ప‌డ‌గ‌'

మొన్న‌టి వ‌ర‌కు మెడిక‌ల్ కాలేజీలు (Medical Colleges), జిల్లా ర‌హ‌దారులను (District Roads) పీపీపీ (PPP) విధాన‌మన్న కూట‌మి క‌న్ను ఇప్పుడు ఫిషింగ్ హార్బ‌ర్ల‌పై ప‌డింది. గత ప్రభుత్వంలో పునాది ప‌డి నిర్మాణం పూర్తిచేసుకున్న జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ (Fishing Harbors) ఇప్పుడు ప్రమాదంలో పడింది. రూ. 289 కోట్లతో అంత‌ర్జాతీయ స్థాయిలో సిద్ధమైన ఈ హార్బర్‌ మత్స్యకారుల కోసం కాకుండా, ‘సాగర్ డిఫెన్స్’ పరిశ్రమ (Sagar Defence Industry) పేరుతో ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. దీనిపై తీరం నుంచి చంద్ర‌బాబు స‌ర్కార్‌పై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. “మా కోసం కట్టిన హార్బర్‌లో ప్రైవేటు కంపెనీల పెత్తనం ఏంటి? మా బతుకులను బుగ్గి చేయొద్దు” అని మత్స్యకారులు కూట‌మి ప్ర‌భుత్వాన్ని వేడుకుంటున్నారు.

అంతర్జాతీయ స్థాయి హార్బర్
గుజ‌రాత్ (Gujarat) త‌రువాత అత్య‌ధిక తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ (Andhra Pradesh). విశాఖ‌ప‌ట్నం (Visakhapatnam Port) త‌రువాత ఒక‌ప్పుడు ప్ర‌ముఖంగా వినిపించిన పేర్లు గ‌న్న‌వ‌రం, కృష్ణ‌ప‌ట్నం పోర్టులు (Krishnapatnam Port) మాత్రమే ఉండేవి. ఈ రెండు పోర్టుల‌ను వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి (Y. S. Rajasekhara Reddy) నిర్మించారు. ఆ త‌రువాత వ‌చ్చిన ప్ర‌భుత్వాలు తీర ప్రాంతాన్ని ప‌ట్టించుకోలేదు. 14 ఏళ్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన చంద్ర‌బాబు నాయుడు (Nara Chandrababu Naidu) కూడా చేయ‌ని స‌రికొత్త ఆలోచ‌న వైఎస్ జ‌గ‌న్ (Y. S. Jagan Mohan Reddy) చేశారు. స‌ముద్రం మీద బ‌తికే గంగ‌పుత్రుల వలసలు నిరోధించేందుకు, వారి జీవ‌నోపాధి మెరుగుప‌ర‌చ‌డంతో పాటు రాష్ట్రానికి ఆదాయం పెంపొందించ‌డం కోసం ఏకంగా 4 పోర్టుల‌కు ఏక‌కాలంలో ప‌నులు మొదలుపెట్టారు. వాటికి అనుబంధంగా 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లకు వైఎస్ జ‌గ‌న్‌ శ్రీకారం చుట్టారు.

అందులో భాగంగా నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నెలో 76.89 ఎకరాల్లో రూ. 289 కోట్లతో హార్బర్‌ను పూర్తిచేశారు. జువ్వ‌ల‌దిన్నె హార్బ‌ర్‌లో ఏకకాలంలో 1250 మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లు నిలిపేలా నిర్మాణం చేశారు. దీని ద్వారా 25,000 మత్స్యకార కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ధి చేకూర‌నుంది. కోల్డ్ చైన్, ఐస్ ప్లాంట్, చిల్ రూమ్, బోట్ రిపేర్ షాపులు, నెట్ మెండింగ్ షెడ్లు ఏర్పాటు చేశారు. ఏటా అదనంగా 41,250 టన్నుల మత్స్య సంపద అందుబాటులోకి వస్తుందని అంచనా వేశారు.

మత్స్యకారులను యజమానులుగా చేయాల‌ని..
కేవలం హార్బర్ నిర్మించడమే కాకుండా, మత్స్యకారులకు 50 శాతం సబ్సిడీపై 1250 మెకనైజ్డ్ బోట్లను అందించాలని గ‌త వైసీపీ ప్రభుత్వం ప్రణాళిక రచించింది. లబ్ధిదారులు కేవలం 10 శాతం వాటా చెల్లిస్తే, మిగతా 90 శాతం బ్యాంకు రుణం వచ్చేలా ఏర్పాట్లు చేశారు. తద్వారా ప్రతి మత్స్యకారుడు తన సొంత బోటుపై వేటకు వెళ్లేలా, మహిళలకు ప్యాకింగ్, మార్కెటింగ్ ద్వారా ఉపాధి లభించేలా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. ఈ హార్బ‌ర్ ద్వారా స్థానికంగా ఉన్న యువ‌త‌కు ఉపాధి ల‌భించింది. ఈ ప్రాంతం నుంచి వ్యాపారం కొన‌సాగితే ప్ర‌త్యక్షంగా, ప‌రోక్షంగా వేలాది కుటుంబాల‌కు ఉపాధి ల‌భించ‌డంతో పాటు ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.

కూటమి సర్కార్‌లో ప్రైవేటు పెత్తనం
అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఈ హార్బర్‌ను ప్రైవేట్‌కు అప్ప‌గించేందుకు వ్యూహరచన చేస్తోంది. జ‌గ‌న్ ప్ర‌భుత్వం పూర్త‌య్యే నాటికి ప‌నులు ఎక్క‌డి వ‌ర‌కు జ‌రిగాయో.. అక్క‌డే నిలిచిపోయాయి. జ‌గ‌న్‌కు మంచి పేరు వ‌స్తుంద‌నే ప‌నులు ఆపేశార‌న్న విమ‌ర్శ ఉండ‌గా, ‘సాగర్ డిఫెన్స్’ పరిశ్రమ సాకుతో ఈ విలువైన భూములను, మౌలిక వసతులను ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేయాలని చూడటంపై మత్స్యకార సంఘాలు మండిపడుతున్నాయి.

జువ్వలదిన్నెను ప్రయోగాత్మకంగా ప్రైవేటు పరం చేసి, ఆ తర్వాత రాష్ట్రంలోని మిగతా హార్బర్లను కూడా కార్పొరేట్ శక్తులకు అప్పగించడమే బాబు సర్కార్ అసలు లక్ష్యమని విమర్శలు వినిపిస్తున్నాయి. హార్బర్లను ప్రైవేటు పరం చేయడం ద్వారా మత్స్యకారులు మళ్లీ కూలీలుగా మారే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మ‌త్స్య‌కారుల జీవ‌నోపాధి గురించి ప‌ట్టించుకోని చంద్ర‌బాబు.. నేడు అడుగు దూరంలో ఉన్న త‌మ బంగారు భ‌విష్య‌త్తును ప్రైవేట్ వ్య‌క్తుల చేతుల్లో పెట్టి.. త‌మ నోట్లో మ‌ట్టికొడుతున్నార‌ని మండిప‌డుతున్నారు.

రేపు జువ్వ‌ల‌దిన్నెకు వైఎస్ జ‌గ‌న్‌
మ‌త్స్య‌కారుల వ‌ల‌స‌ల‌ను అరిక‌ట్ట‌డం కోసం నిర్మించిన జువ్వ‌ల‌దిన్నె హార్బ‌ర్ ప్రైవేట్‌ప‌రం చేయ‌డాన్ని నిర‌సిస్తూ గంగ‌పుత్రులు చేస్తున్న ఆందోళ‌న‌కు వైఎస్ జ‌గ‌న్ మ‌ద్ద‌తు తెల‌ప‌నున్నారు. ఈ సంద‌ర్భంగా రేపు ఆయ‌న జువ్వ‌ల‌దిన్నె ప్రాంతాన్ని ప‌రిశీలించి మ‌త్స్య‌కారుల‌తో ముఖాముఖి నిర్వహించనున్నారు. తన హయాంలో మత్స్యకారుల జీవన ఉపాధి కోసం నిర్మించి పూర్తిచేసిన ప్రాజెక్ట్‌ను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ వ్య‌క్తుల‌కు క‌ట్ట‌బెడుతున్న ప్ర‌భుత్వాన్ని నిల‌దీయ‌నున్న‌ట్టు వైసీపీ తెలిపింది. జగన్‌ రాక మత్స్యకారుల పోరాటానికి మరింత బలం చేకూర్చే అవకాశం కనిపిస్తోంది. అదే అదనుగా జగన్‌ ఇచ్చే భరోసాతో మత్స్యకారులు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని భావిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment