శ్రీసత్యసాయి జిల్లా కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అఫీషియల్ దొంగలు పడ్డారు. కొందరు నేతలు, అధికారులు కుమ్మక్కై ప్రభుత్వానికి రావాల్సిన రూ.25 కోట్ల ఆదాయానికి గండికొట్టారు. ఈ విషయం ఏకంగా కూటమిలోని బీజేపీ కీలక నాయకుడు బయటపెట్టడం సంచలనంగా మారింది. ఈ మొత్తం వ్యవహారంలో సొంత కూటమి నేతలే ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పరోక్షంగా గళం విప్పడం చర్చనీయాంశమైంది.
ఏమిటీ కుంభకోణం?
కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గత రెండేళ్లుగా దాదాపు రూ. 25 కోట్ల మేర అవినీతి జరిగినట్లు బీజేపీ రాష్ట్ర నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. రిజిస్ట్రేషన్ విలువను ఇష్టానుసారంగా తగ్గించి, తక్కువ స్టాంప్ డ్యూటీ చెల్లించేలా చూస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారని ఆయన సత్యసాయి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
ఈ కుంభకోణం వెనుక స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ హస్తం ఉందని బీజేపీ, జనసేన నేతలు బాహటంగానే ఆరోపిస్తున్నారు. కొందరు అధికారులు ఈ అక్రమాలకు పాల్పడ్డారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. సాధారణంగా కూటమి ప్రభుత్వంలో నేతలు సర్దుకుపోతుంటారు. కానీ, ఇక్కడ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వంలో జనసేన నేతలు, చివరికి టీడీపీలోని అసమ్మతి వర్గం కూడా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసన పరోక్షంగా గళం విప్పడం గమనార్హం. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని కొందరు అధికారులను ‘అఫీషియల్ దొంగలు’గా అభివర్ణిస్తూ, రాజకీయ అండదండలతో వారు ఖజానాను లూటీ చేస్తున్నారని నేతలు మండిపడుతున్నారు.
నేతల డిమాండ్
సమగ్ర విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు. గత రెండేళ్లలో జరిగిన రిజిస్ట్రేషన్లన్నింటినీ రీ-వెరిఫికేషన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి నష్టం కలిగించిన సొమ్మును బాధ్యుల నుంచి వసూలు చేయాలని, అవినీతికి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కదిరి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే కందికుంటపై సొంత కూటమి నేతలు, అసమ్మతి నేతలు ఏకమవ్వడం భవిష్యత్ రాజకీయ పరిణామాలకు సంకేతంగా కనిపిస్తోంది. అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో, కలెక్టర్ విచారణకు ఏ మేరకు ఆదేశిస్తారో వేచి చూడాలి.
కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రూ.25 కోట్ల అవినీతి
— Telugu Feed (@Telugufeedsite) April 14, 2026
అధికారులపై కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి
రిజిస్ట్రేషన్ వ్యాల్యూ తగ్గించి.. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొట్టారని ఫిర్యాదు
కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 25 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని… pic.twitter.com/w1eNsw32ZY








