తిరుమలలో ‘ఆకు రౌడీల’ రాజ్యం – భూమన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తిరుమలలో ‘ఆకు రౌడీల’ రాజ్యం - భూమన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Summarize with AI

తిరుమల పవిత్రతను, టీటీడీ(TTD) విశిష్టతను ప్రస్తుత చైర్మన్ బి.ఆర్. నాయుడు (B. R. Naidu) భ్రష్టు పట్టిస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తిరుమల కొండపై అరాచక శక్తులు, అసాంఘిక కార్యక్రమాలు పెరిగిపోతున్నాయని, దీనికి ప్రస్తుత చైర్మన్ అనుసరిస్తున్న తీరే కారణమని ఆయన ఆరోపించారు. తాడేప‌ల్లిలో భూమ‌న‌ మీడియాతో మాట్లాడారు.

ఆకు రౌడీల‌కు అడ్డాగా తిరుమ‌ల‌!
బి.ఆర్. నాయుడు టీటీడీ చైర్మన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి తిరుమల అరాచక శక్తులకు నిలయంగా మారిందని భూమన విమర్శించారు. “ఆకు రౌడీలంతా ఇప్పుడు బి.ఆర్. నాయుడు చెంత చేరారు. వారిని ఆయన స్వయంగా పెంచి పోషిస్తున్నారు” అని భూమన ఆరోపించారు. సామాన్య భక్తులకు అందాల్సిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను సైతం ఈ రౌడీ మూకలకు కట్టబెడుతూ, వారిని ఆర్థికంగా బలపరుస్తున్నారని ధ్వజమెత్తారు.

ఆధ్యాత్మిక వైభవం ఎక్కడ? బూతులు ఎక్కడ?
తిరుమల వంటి పుణ్యక్షేత్రంలో వేద మంత్రాలు, అనుగ్రహ భాషణలు వినిపించాల్సిన చోట, ఇప్పుడు రౌడీల బూతులు (Abusive Words of Rowdies) వినిపిస్తున్నాయని భూమన ఆవేదన వ్యక్తం చేశారు. చైర్మన్ తీరుకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలిపిన మహిళలపై ఆకు రౌడీలతో దాడులు చేయించడమే కాకుండా, వారిపైనే తిరిగి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. హిందువులు, రాష్ట్ర ప్రజలు బి.ఆర్. నాయుడు తీరుపై ఆగ్రహంగా ఉన్నా, ప్రభుత్వం మాత్రం ఆయనను వెనకేసుకొస్తోందని విమర్శించారు.

50 ఏళ్ల క్రితమే ఇలాంటి వారిని తొక్కేశా!
ప్రస్తుత చైర్మన్ తీరుపై తన పోరాటాన్ని గుర్తు చేస్తూ.. “నేను 50 ఏళ్ల క్రితమే అసాంఘిక శక్తులపై ఉద్యమ నాయకుడిగా పోరాటం చేశాను. ఇలాంటి చిల్లర రౌడీలను ఎంతోమందిని తొక్కేశాను” అని భూమన హెచ్చరించారు. టీటీడీ ఔన్నత్యాన్ని కాపాడడంలో బి.ఆర్. నాయుడు పూర్తిగా విఫలమయ్యారని, ఆయన ఆ పదవికి ఏమాత్రం అర్హుడు కాదని స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment