సినీ ఫక్కీలో జరిగిన ఒక ఉన్మాద ఘటన మేడ్చల్ జిల్లా పోచారంలో తీవ్ర కలకలం రేపింది. తనకు కాబోయే భార్య పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో, ఒక యువకుడు ఆమె శరీరంలోకి సిరంజి ద్వారా తన రక్తాన్ని బలవంతంగా ఇంజెక్ట్ చేశాడు. నిందితుడు తాను హెచ్ఐవీ (HIV) బాధితుడినని తెలిసి కూడా ఈ ఘాతుకానికి ఒడిగట్టడం స్థానికంగా భయాందోళనలకు గురిచేస్తోంది.
అసలేం జరిగింది?
పోచారానికి చెందిన మనోహర్ అనే యువకుడికి, ఒక యువతితో గతంలో వివాహం నిశ్చయమైంది. అయితే, పెళ్లికి ముందే మనోహర్ కుటుంబ సభ్యులతో పాటు అతనికి కూడా హెచ్ఐవీ (HIV) పాజిటివ్ ఉందని యువతి కుటుంబానికి తెలిసింది. దీంతో ప్రాణహాని ఉంటుందన్న భయంతో యువతి తండ్రి ఈ వివాహాన్ని రద్దు చేసుకున్నారు.
సిరంజితో దాడి..
పెళ్లి నిశ్చయమైన యువతి తనను కాదన్నదన్న కక్షతో మనోహర్ ఈనెల 11న ఆమె ఇంటికి వెళ్లాడు. తననే పెళ్లి చేసుకోవాలని యువతిపై, ఆమె తండ్రిపై ఒత్తిడి తెచ్చాడు. వారు నిరాకరించడంతో ఉన్మాదిలా ప్రవర్తించిన మనోహర్.. తన వెంట తెచ్చుకున్న సిరంజి ద్వారా తన రక్తాన్ని సేకరించి, యువతికి బలవంతంగా ఇంజెక్ట్ చేశాడు. ఈ హఠాత్పరిణామంతో షాక్‌కు గురైన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు.
కేసు నమోదు.. దర్యాప్తు
యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోచారం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు మనోహర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, తగిన చికిత్స అందిస్తున్నారు. గతంలో విడుదలైన ‘రాంబాయి’ సినిమాలోని సీన్ తరహాలో ఈ ఘటన జరగడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.








