అప్పులేకుండా గ‌డిచింది 8 రోజులే.. ‘కాగ్’ రిపోర్ట్‌లో షాకింగ్ విష‌యాలు

అప్పులేకుండా గ‌డిచింది 8 రోజులే.. 'కాగ్' రిపోర్ట్‌లో షాకింగ్ విష‌యాలు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఆర్థిక పరిస్థితిపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) (Comptroller and Auditor General – CAG Report) నివేదిక బాంబు పేల్చింది. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, వాస్తవ గణాంకాలకు అస్సలు పొంతన లేదని కాగ్ స్పష్టం చేసింది. అభివృద్ధి పేరుతో సాగుతున్న ప్రచారం వెనుక ప్రమాదకరమైన ఆర్థిక నిర్వహణ దాగి ఉందంటూ సంచలన విషయాలను బయటపెట్టింది.

ఆదాయం ‘డల్’.. అప్పులు ‘ఫుల్’!
రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని ప్రభుత్వం చెబుతున్నా, ఆదాయం (Revenue) మాత్రం దారుణంగా పడిపోయిందని కాగ్(CAG) పేర్కొంది. రెవెన్యూ రాబడులు 2023-24తో పోలిస్తే 2024-25లో రాబడులు 3.51% తగ్గాయి. పన్నేతర ఆదాయం ఏకంగా 19.64 శాతం పతనం కావడం గమనార్హం. కేంద్రంలో భాగస్వామిగా ఉన్నా, రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ (Grant-in-Aid) 41.82 శాతం తగ్గిపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని నివేదిక పేర్కొంది.

రూ.20 వేల కోట్ల బడ్జెట్
బడ్జెట్‌లో రూ.2,69,928 కోట్ల రెవెన్యూ వస్తుందని ఆశ చూపిన ప్రభుత్వం, వాస్తవంగా రూ.2,49,191 కోట్లు మాత్రమే సాధించింది. అంటే సుమారు రూ.20 వేల కోట్ల తేడా. ఈ అంకెల గారడీ ఆర్థిక ప్రణాళిక వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమైన మూలధన వ్యయం (Capital Expenditure) విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, బడ్జెట్‌లో రూ.45,382 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి, వాస్తవంగా ఖర్చు చేసింది కేవలం రూ.16,141 కోట్లు మాత్రమేన‌ని కాగ్ గ‌ణాంకాల ప్ర‌కారం తెలుస్తోంది. ఇది రాష్ట్ర జీఎస్‌డీపీలో (Gross State Domestic Product – GSDP) కేవలం 1 శాతం మాత్రమే. అంటే ఆస్తుల సృష్టి కంటే కేవలం రోజువారీ నిర్వహణకే నిధులు సరిపోతున్నాయని స్పష్టమవుతోంది.

20 నెలల్లో రూ.3.17 లక్షల కోట్ల అప్పు
గత ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పు సుమారు రూ.3.31 లక్షల కోట్లు కాగా, ప్రస్తుత చంద్రబాబు (Nara Chandrababu Naidu) ప్రభుత్వం కేవలం 20 నెలల్లోనే రూ.3,17,448 కోట్ల అప్పు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఫిస్కల్ డెఫిసిట్ (ద్రవ్య లోటు) 4% ఉండాల్సి ఉండగా, అది 5.05%కి చేరుకుంది. ఏడాదిలో 365 రోజులకు గాను 357 రోజులు ఆర్‌బీఐ(RBI) వద్ద చేబదుళ్లు తీసుకోవడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోంది. దీనికోసమే రూ.303 కోట్లు వడ్డీ కట్టాల్సి వచ్చింది.

పోలవరానికి ఆ తప్పిదాలే శాపం
పోలవరం ప్రాజెక్టుపై కూడా కాగ్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 2017-18లో నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయడం వల్ల డయాఫ్రం వాల్ దెబ్బతిని రూ.399.77 కోట్లు వృథా అయ్యాయని కాగ్ తేల్చింది. ఆ తప్పుల వల్ల ఇప్పుడు ప్రాజెక్టును చక్కదిద్దేందుకు అదనంగా రూ.3,000 కోట్లు ప్రజాధనం ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రధాన డ్యాం నిర్మాణంలో డిజైన్ల ఆమోదం లేకుండానే పనులు పూర్తి చేయడం ప్రమాదకరమని సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) అభ్యంతరాలను కాగ్ ఉటంకించింది.

అప్పుల వృద్ధి రేటు గతంలో 13.09% ఉండగా, ఇప్పుడు అది రికార్డు స్థాయికి చేరింది. అంకెలను సవరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారనే విమర్శలకు కాగ్ నివేదిక బలాన్ని చేకూర్చింది. సంపద సృష్టిస్తామని చెప్పిన ప్రభుత్వం, అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని కూరుకుపోయేలా చేస్తోందనేది కాగ్ నివేదిక సారాంశం అని ఆర్థిక నిపుణులు, రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment