కోలీవుడ్‌లో నటి త్రిష చుట్టూ ప్రస్తుతం పెద్ద చర్చ నడుస్తోంది. నటుడు విజయ్ తన భార్య సంగీతతో విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్న వేళ, విజయ్–త్రిష ఒకే రిసెప్షన్ వేడుకలో కలిసి కనిపించడం సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. ఆ కార్యక్రమంలో ఇద్దరూ పక్కపక్కనే నడుస్తూ, కలిసి ఫోటోలకు పోజులు ఇవ్వడం చూసి నెట్టింట అనేక ఊహాగానాలు మొదలయ్యాయి.
ఈ పరిణామాల మధ్య నటుడు, దర్శకుడు ఆర్. పార్తీబన్ చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి తెరతీశాయి. ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన త్రిషను ఉద్దేశిస్తూ “ఈ కుందవైని కొన్ని రోజులు ఇంట్లోనే ఉంచాలి… బయటకు రానివ్వకూడదు” అంటూ చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు కారణమయ్యాయి.
సోషల్ మీడియాలో త్రిష ఘాటు స్పందన
పార్తీబన్ వ్యాఖ్యలపై త్రిష నేరుగా ఆయన పేరు ప్రస్తావించకుండా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్‌లో ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.“ఇటీవల జరిగిన ఒక కార్యక్రమ నిర్వాహకులు నాకు సమాచారం అందించారు. ఒక వ్యక్తి తన సహాయకుడి ద్వారా చేసిన అభ్యర్థన మేరకు చివరి నిమిషంలో నా పేరు, ఫోటోను ఉపయోగించారని తెలిసింది. మైక్ చేతిలో ఉందని ఏది పడితే అది మాట్లాడితే అది విజ్ఞత కాదు… అది మూర్ఖత్వాన్ని మాత్రమే బయటపెడుతుంది. అవగాహన లేకుండా మాట్లాడే మాటలు ఎదుటివారిని కాదు, మాట్లాడే వ్యక్తి స్థాయినే తగ్గిస్తాయి” అని త్రిష స్పష్టం చేశారు.
విజయ్ కుటుంబ వ్యవహారం చుట్టూ కూడా చర్చ
ఇక మరోవైపు విజయ్ వ్యక్తిగత జీవితం కూడా కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన భార్య సంగీత ఇప్పటికే చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానంలో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. చెన్నైలోని తమ నివాసంలో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కూడా ఆమె కోర్టును అభ్యర్థించినట్లు తెలుస్తోంది.
1999లో వివాహం చేసుకున్న విజయ్–సంగీత దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదే సమయంలో విజయ్ త్వరలో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయంగా రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సమస్యలు, త్రిషతో కలిసి కనిపిస్తున్న ఫోటోలు ప్రస్తుతం కోలీవుడ్‌లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.
“మైక్ ఉందని ఏది పడితే అది మాట్లాడొద్దు”… పార్తీబన్‌కు త్రిష కౌంటర్








