తిరుమలలో కేక్ కటింగ్ (Tirumala Cake Cutting) ఘటనపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) తీవ్రంగా స్పందించారు. తిరుమలలో కేక్ కట్ చేసిన విషయంపై తనపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ మేరకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఓ వీడియో విడుదల చేశారు.
తిరుమలలో కేక్ కటింగ్ చేయకూడదనే విషయం తమకు తెలియదని ఆయన అన్నారు. స్వామివారి సన్నిధిలో తనుజా పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా ఎగ్‌లెస్ కేక్ (Eggless Cake) తీసుకువచ్చి కట్ చేశామని తెలిపారు. తమ కుటుంబానికి వెంకటేశ్వర స్వామి ఇలవేల్పు దేవుడని, స్వామివారి క్షేత్రంలో ఎలాంటి అపచారం చేయాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు.
ఈ ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams – TTD) చైర్మన్ (Chairman) బీఆర్ నాయుడు (BR Naidu) తనపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయించారని దువ్వాడ ఆరోపించారు. అయితే టీటీడీ చైర్మన్‌కు సంబంధించిన రాసలీలల వీడియో క్లిప్పింగ్స్‌లో తప్పు లేదని చెబుతున్నప్పుడు, ఎగ్‌లెస్ కేక్ కట్ చేయడంలో తప్పు ఏమిటని ఆయన ప్రశ్నించారు.
“టీటీడీ చైర్మన్ వీడియోల్లో తప్పు లేదంటే, నేను కేక్ కట్ చేసిన దానిలో తప్పు ఏముంది? ఎమ్మెల్సీగా నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను” అని దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. తనపై జరుగుతున్న ప్రచారం టీటీడీ చైర్మన్‌కు సంబంధించిన వివాదాల నుంచి దృష్టి మళ్లించేందుకు చేస్తున్న డైవర్షన్ రాజకీయమని కూడా ఆరోపించారు. ఇక కేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేశారు.
అలాగే తిరుమల లడ్డూ (Tirumala Laddu) నెయ్యి (Ghee)వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ(CBI) చెప్పినా కలిసిందని చెప్పి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు. “మేము తప్పు చేసి ఉంటే స్వామివారి శిక్షకు బాధ్యులమవుతాము,” అని దువ్వాడ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ ఘటనతో తిరుమలలో కేక్ కటింగ్ అంశం రాజకీయ రంగు దాల్చి మరింత వివాదాస్పదంగా మారింది.








