ఏపీ పోలింగ్ ‘మిరాకిల్’లో మిస్టరీ? 51 లక్షల ఓట్లపై కొత్త ప్రశ్నలు

ఏపీ పోలింగ్ ‘మిరాకిల్’లో మిస్టరీ? 51 లక్షల ఓట్లపై కొత్త ప్రశ్నలు

ఆంధ్రప్రదేశ్ 2024 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గణాంకాలు మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త, రాజకీయ ఆర్థిక శాస్త్రవేత్త పరకాల ప్రభాకర్ ఇటీవల ది వైర్ వెబ్‌సైట్‌లో రాసిన విశ్లేషణ సంచ‌ల‌నంగా మారింది. 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కూటమి 175 స్థానాల్లో 164 సీట్లు గెలుచుకోవడం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అయితే పోలింగ్ శాతాల్లో నమోదైన మార్పులు, అధికారిక ప్రకటనల్లో ఉన్న వ్యత్యాసాలు ఎన్నికల నిర్వహణపై కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతున్నాయని ఆ విశ్లేషణలో పేర్కొన్నారు.

పోలింగ్ శాతం టైమ్‌లైన్: ఏమి చెబుతోంది?
మే 13, 2024న అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ జ‌రిగింది. ఉద‌యం ప్రారంభ‌మైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి ప్రకటించిన ప్రకారం పోలింగ్ శాతం 68.04గా నమోదైంది. అదే రోజు రాత్రి 8 గంటలకు భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రకటనలో అది 68.12 శాతంగా పేర్కొన్నారు. అయితే రాత్రి 11:45 గంటలకు విడుదలైన తదుపరి ప్రకటనలో పోలింగ్ శాతం 76.50గా నమోదు కావడం గమనార్హం. అనంతరం మే 17న విడుదలైన గణాంకాల్లో పోలింగ్ శాతం 80.66గా, తుది లెక్కల్లో 81 శాతానికి పైగా నమోదైనట్లు వెల్లడించారు.

మొత్తం పెరుగుదల 8.04 శాతం నుంచి 81.79 శాతం అంటే 12.54 శాతం పెరిగిన‌ట్టు. ఈ పెరుగుదల గ్రాస్‌గా 51,83,249 అదనపు ఓట్లు. 175 నియోజకవర్గాలకు సమానంగా పంచితే.. ప్రతి సీటుకు 29,618 ఓట్లు. ఇది కొన్ని నియోజకవర్గాల్లో కేంద్రీకృతమైతే ఫలితాలపై భారీ ప్రభావం చూపే అవకాశం ఉంది. టైమ్‌లైన్‌లో విపరీత పెరుగుదల, CEO, ECI గణాంకాల్లో వ్యత్యాసాలు, అర్ధరాత్రి తర్వాత భారీ పోలింగ్, నాలుగు రోజుల తర్వాత మరింత పెరుగుదల, ఈ అంశాలు ఎన్నికల సమగ్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

అర్ధరాత్రి తర్వాత భారీ పోలింగ్?
ఎన్నికల సంఘం వివరాల ప్రకారం, రాత్రి ఆలస్యంగా కూడా కొన్ని వేల బూత్‌లలో పోలింగ్ కొనసాగిందని తెలిపారు. అయితే తక్కువ వ్యవధిలో లక్షల సంఖ్యలో ఓట్లు నమోదు కావడం సాధ్యమేనా అన్న ప్రశ్నను పరకాల ప్రభాకర్ తన క‌థ‌నంలో లేవనెత్తారు.

రాష్ట్రంలోని మొత్తం 46,389 బూత్‌లలో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు సగటున గంటకు 60.7 ఓట్లు నమోదయ్యాయి. అదే రేటు ప్రకారం చూస్తే.. ఒక్కో ఓటుకు కనీసం 1 నిమిషం పట్టినా.. 491 ఓట్లకు 491 నిమిషాలు (సుమారు 8 గంటలు) స‌మ‌యం ప‌ట్టాలి. 2 నిమిషాలైతే 16 గంటలు పట్టాలి. కానీ, ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ (మే 14న) ఇచ్చిన ప్రకటన ప్రకారం “చివరి ఓటు ఉదయం 2 గంటల ప్రాంతంలో నమోదైంది” అంటే రాత్రి 11:45 నుంచి ఉదయం 2 వరకు కేవలం 2 గంటలు 15 నిమిషాల్లో 17,19,482 ఓట్లు ఎలా నమోదయ్యాయి?

ఒక్కో ఓటరు రెండు ఓట్లు వేశారు (అసెంబ్లీ + లోక్‌సభ). VVPAT ప్రక్రియలో ఒక్కో ఓటుకు 7 సెకన్లు పడుతుంది. రెండు ఓట్లకు 14 సెకన్లు ఖచ్చితంగా పడుతుంది. మిగిలిన ప్రక్రియలకు (పేరు చెక్, సంతకం, ఇంకింగ్, కదలిక) కేవలం 6 సెకన్లు మాత్రమే మిగులుతాయి. 30 సెక‌న్ల‌లో ఇవ‌న్నీ సాధ్య‌మా..? అన్న ప్ర‌శ్న‌లు ప్ర‌జ‌ల‌ను ఆలోచింప‌జేస్తున్నాయి.

విధి విధానాల అమలు ప్రశ్నార్థకమా?
ఎన్నికల నియమావళి ప్రకారం, పోలింగ్ ముగిసే సమయానికి క్యూలో ఉన్న ఓటర్లకు టోకెన్లు ఇవ్వాలి, చివరి ఓటరు వరకు వీడియో రికార్డింగ్ చేయాలి, సంబంధిత వివరాలు ప్రీసైడింగ్ అధికారి డైరీలో నమోదు చేయాలి. ఈ ప్రక్రియలు పూర్తిగా అమలయ్యాయా? సంబంధిత రికార్డులు పరిశీలనకు అందుబాటులో ఉన్నాయా? అనే ప్రశ్నలు కూడా వ్యాసంలో ప్రస్తావించారు.

నాలుగు రోజుల్లో పెరుగుదల
మే 13 రాత్రి నమోదైన పోలింగ్ శాతం, మే 17న ప్రకటించిన గణాంకాల మధ్య గణనీయమైన పెరుగుదల కనిపించడం మరో చర్చకు దారి తీసింది. మొత్తం అదనపు ఓట్ల సంఖ్య లక్షల్లో ఉండటంతో, అది నియోజకవర్గాల వారీగా ఎలా ప్రభావం చూపిందన్న అంశం కూడా పరిశీలనీయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

స్పష్టత అవసరమా?
ఈ గణాంకాలన్నీ ఎన్నికల సంఘం, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం విడుదల చేసిన అధికారిక పత్రాల ఆధారంగానే ఉన్నప్పటికీ, వాటి మధ్య ఉన్న వ్యత్యాసాలపై స్పష్టత అవసరమని పరకాల ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. ఎన్నిక‌ల పోలింగ్ స‌ర‌ళిపై ఆయ‌న‌ లేవనెత్తిన ప్రశ్నలకు ఎన్నికల సంఘం సమగ్ర సమాధానాలు ఇస్తేనే అనుమానాలు నివృత్తి అవుతాయని విశ్లేషకులు సూచిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment