హైదరాబాద్‌లోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL)లో అగ్ని ప్రమాదం సంభవించింది. నేర పరిశోధనలకు సంబంధించి అత్యంత కీలకమైన ఆధారాలు భద్రపరిచే ఈ ల్యాబ్‌లో మంటలు చెలరేగడంతో, పలు ముఖ్యమైన ఫైళ్లు దగ్ధమైనట్లు సమాచారం. ముఖ్యంగా ఓటుకు నోటు కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు ఇక్కడే ఉన్నాయన్న నేపథ్యంలో, ఈ అగ్నిప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఓటుకు నోటు కేసుకు సంబంధించిన వాయిస్ రికార్డింగ్‌లను, ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం పుట్టించిన తప్పుడు ఆధారాలను కప్పిపుచ్చడానికి ప్రయత్నంగా అనుమానిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నేర పరిశోధనలకు సంబంధించిన ఫైల్ ఎవిడెన్స్ ల్యాబొరేటరీ మొత్తం ఇదే కేంద్రంగా పనిచేస్తోంది. అలాంటి కీలక కేంద్రంలో మంటలు చెలరేగడం సహజ ప్రమాదమా..? లేక ఆధారాలు మాయం చేసేందుకే కావాలనే చేశారా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అగ్నిప్రమాదంలో ఏఏ ఫైళ్లు పూర్తిగా కాలిపోయాయో ఇప్పటివరకు అధికారికంగా స్పష్టత రాలేదు. దగ్ధమైన డాక్యుమెంట్ల వివరాలపై అధికారులు పరిశీలన చేపట్టారు. ఈ ఘటన నేర దర్యాప్తులపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నదానిపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ల్యాబ్ మొదటి అంతస్తులో కంప్యూటర్లు, డిజిటల్ డేటా భద్రపరిచే విభాగం ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ రంగంలోకి దిగి ఐదు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చింది. పెద్ద ప్రమాదం జరగకుండా సమయానికి స్పందించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ల్యాబ్‌లో నలుగురు ఉద్యోగులు లోపలే ఉన్నట్లు వెల్లడించారు. మంటలను గమనించిన వెంటనే వారు అప్రమత్తమై సురక్షితంగా బయటికి వచ్చారని సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని స్పష్టం చేశారు.








ఆది ‘కమ్మగా’ వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు – ఏపీ బీజేపీ చీఫ్