బల్క్ డ్రగ్ పార్క్‌కు వ్యతిరేకంగా ఉద్యమించిన సీపీఎం నేత అప్పలరాజు కోర్టు ఆదేశాల మేరకు 45 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. ఎలాంటి నేరం చేయకుండానే అప్పలరాజుపై అక్రమంగా పీడీ యాక్ట్ ప్రయోగించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కూటమి ప్రభుత్వానికి ఈ పరిణామం పెద్ద ఎదురుదెబ్బగా మారింది.
అప్పలరాజు విడుదల అనంతరం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు స్పందిస్తూ.. ఇది ప్రజా ఉద్యమాలకు లభించిన నైతిక విజయమన్నారు. రైతులు, మత్స్యకారుల తరఫున పోరాడినందుకే అప్పలరాజుపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష కట్టిందని విమర్శించారు. పోరాటాల నాయకుడిని జైలుకు పంపిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు.
అప్పలరాజు అరెస్టును ఖండిస్తూ విశాఖతో పాటు పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయని, ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించారని సీపీఎం నేతలు తెలిపారు. ఈ అరెస్టుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందని, చివరకు ప్రభుత్వ కుట్ర విఫలమైందని వ్యాఖ్యానించారు.
హోం మంత్రిపై తీవ్ర విమర్శలు
ఉద్యమకారుడు అప్పలరాజు మాట్లాడుతూ.. హోం మంత్రి అనిత అహంకార ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు పూర్తిగా ఆమె నియంత్రణలో పనిచేస్తూ అక్రమ కేసులు నమోదు చేశారని అన్నారు. తనపై ఏకంగా 7 అక్రమ కేసులు పెట్టి, చివరకు పీడీ యాక్ట్ ప్రయోగించారని వెల్లడించారు. హోం మంత్రి అనిత, మంత్రి నారా లోకేష్ తమపై 37 కేసులు ఉన్నాయని బహిరంగంగా చెబుతున్నారని గుర్తు చేసిన అప్పలరాజు, అలాంటప్పుడు లోకేష్‌పై ఎందుకు పీడీ యాక్ట్ పెట్టరని ప్రశ్నించారు. హోం మంత్రిపై కూడా పీడీ యాక్ట్ పెట్టాల్సిన అవసరం లేదా అని నిలదీశారు.
సరైన నష్టపరిహారం ఇవ్వకుండా పరిశ్రమల కోసం భూములు ఎలా లాక్కుంటారని అప్పలరాజు ప్రశ్నించారు. పరిహారం ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనా? లేక హోం మంత్రిదేనా? అని వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను మిట్టల్ కోసం ఫణంగా పెట్టారని విమర్శించిన అప్పలరాజు, స్టీల్ ప్లాంట్‌కు లాభాలు రావడం కార్మికుల పోరాట ఫలితమేనన్నారు. బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణాన్ని పూర్తిగా ఆపే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.








