భారత క్రికెట్ అభిమానుల్లో ఎప్పటికీ చర్చకు వచ్చే ప్రశ్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వన్డే వరల్డ్‌కప్‌లో ఆడతారా? ఈ అంశంపై తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ ప్రశ్న ఎదురుకావడంతో, మొదట సరదాగా తప్పించుకున్న ధోని, వెంటనే సీరియస్‌గా స్పందిస్తూ స్పష్టత ఇచ్చారు. ఆటగాళ్ల విషయంలో వయస్సు కంటే ఫిట్‌నెస్, ఫామ్‌నే అసలైన ప్రమాణాలుగా చూడాలని ఆయన అభిప్రాయపడ్డారు.
“2027 వరల్డ్‌కప్ ఎందుకు ఆడకూడదు?” అంటూ ప్రశ్నించిన ధోని, 22 ఏళ్ల వయసున్న ఆటగాడు ఫిట్ లేకపోతే జట్టులో ఉండకూడదని, అదే 35 ఏళ్లవాడు ఫిట్‌గా మంచి ప్రదర్శన ఇస్తే తప్పకుండా అవకాశం ఇవ్వాలని అన్నారు. తాను జట్టులోకి వచ్చినప్పుడు తన వయస్సును ఎవరూ ప్రశ్నించలేదని గుర్తు చేసిన ధోని, ఇప్పటికీ అదే దృక్పథం కొనసాగాలని సూచించారు. రోహిత్, విరాట్ లేదా భవిష్యత్తులో వచ్చే ఎవరైనా— అందరికీ ఒకే నియమాలు వర్తించాలన్నారు. దేశం కోసం ఆడాలనే తపన ఉండి, ప్రదర్శన కొనసాగితే ఎవరి కెరీర్‌ను ఆపాల్సిన అవసరం లేదని ధోని వ్యాఖ్యానించడంతో ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.







