తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యూహం సోషల్ మీడియాలో బెడిసికొట్టింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారో తెలుసుకునే ఉద్దేశంతో తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో నిర్వహించిన పోల్, అనూహ్య ఫలితాలను ఇచ్చింది. ఈ పోల్ ద్వారా రేవంత్ సర్కార్‌పై ప్రజల్లో ఉన్న అసంతృప్తి బహిర్గతమైందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
“తెలంగాణ ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు?” అంటూ కాంగ్రెస్ ట్విట్టర్లో రెండు ఆప్షన్లతో పోల్ నిర్వహించింది. ఒకటి “ప్రజల వద్దకు పాలన”, రెండోది “ఫామ్ హౌస్ పాలన”. అయితే, కాంగ్రెస్ ఆశించిన ఫలితం కాకుండా, ప్రజలు ఇచ్చిన ఓటింగ్ పార్టీకి భారీ షాక్ ఇచ్చింది.
పోల్ ఏర్పాటు చేసిన 24 గంటల్లో మొత్తం 92,551 మంది ఇందులో పాల్గొన్నారు. వీరిలో ఏకంగా 67 శాతం మంది “ఫామ్ హౌస్ పాలన”కే మద్దతు తెలపగా, కాంగ్రెస్ నినాదమైన “ప్రజల వద్దకు పాలన”కు కేవలం 33 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఫలితాలు చూసి కాంగ్రెస్ శిబిరంలోనే అసహనం వ్యక్తమవుతోందని సమాచారం.
ప్రజలు రెండో ఆప్షన్‌ను పూర్తిగా పక్కన పెట్టడం ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరుపై ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టంగా అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ స్వయంగా నిర్వహించిన పోల్‌నే తమకు వ్యతిరేకంగా మారిందని, అనవసరంగా పోల్ పెట్టి అడ్డంగా ఇరుక్కున్నామంటూ ఆ పార్టీ నేతలే అంతర్గతంగా చర్చించుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది.
ఈ ట్విట్టర్ పోల్ ఫలితాలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. రేవంత్ సర్కార్‌కు ప్రజల నుంచి వస్తున్న స్పందనపై విపక్షాలు ఇప్పటికే విమర్శలు గుప్పిస్తుండగా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పోల్‌నే ఆ విమర్శలకు బలం చేకూర్చిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.








