వైఎస్ జగన్‌పై హోంమంత్రి ట్వీట్‌.. వెంటనే డిలీట్

వైఎస్ జగన్‌పై హోంమంత్రి ట్వీట్‌.. వెంటనే డిలీట్

ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత చేసిన ఓ ట్వీట్‌ రాజకీయంగా కలకలం రేపింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి ఆమె తన అధికారిక ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీయడంతో, ఆ పోస్ట్‌ను క్షణాల్లోనే డిలీట్ చేయడం ఆస‌క్తిక‌రంగా మారింది.

హోంమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, మాజీ ముఖ్య‌మంత్రిని, ప్రతిపక్ష నేతను ఉద్దేశించి “బెంగళూరు అంకుల్” అంటూ వ్యక్తిగత దూషణలకు దిగడం తగదని నెటిజన్లు మండిపడ్డారు. అది కూడా హోంమంత్రి హ్యాండిల్ నుంచి మార్ఫ్‌డ్ పోస్ట్ చేయ‌డంతో వ్య‌తిరేక‌త తీవ్ర‌మైంది. హోంమంత్రిగా ఉన్న వ్యక్తికి సరైన భాష కాదని, హోదాను మరిచి ఫ‌క్తు రాజకీయ విరోధిలా వ్యవహరించారని సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. నెటిజ‌న్ల నుంచి పూర్తి వ్యతిరేకత పెరిగిపోవడంతో అనిత ఆ పోస్ట్‌ను వెంట‌నే తొలగించారు.

వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఘాటు కౌంటర్
హోంమంత్రి ట్వీట్‌పై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఘాటుగా స్పందించారు. “‘బెంగళూరు అంకుల్’ అంటూ హోంమంత్రి అనిత చేసిన జుగుప్సాకరమైన రాతలు చూస్తే, కూటమి ప్రభుత్వానికి ఉన్న రాజకీయ భావదారిద్ర్యం ఏంటో స్పష్టంగా అర్థమవుతోంది” అని విమర్శించారు. సిద్ధాంతాలు, విధానాలపై చర్చలు చేయకుండా, వ్యక్తిగత దూషణలతో రాజకీయాలు చేయడం ద్వారా ఆమె స్థాయి దిగజారుతుందని హెచ్చరించారు. దళిత మహిళకు హోంమంత్రి పదవి ఇవ్వాలనే వైఎస్ జగన్ రాజకీయ విధానాన్ని మార్చలేకనే చంద్రబాబు ఆమెకు ఆ పదవి ఇచ్చారని వ్యాఖ్యానించారు.

“మేము కూడా ‘హైదరాబాద్ ఆటగాడు’, ‘పిఠాపురం పాటగాడు’ అంటూ వ్యాఖ్యలు చేయగలం. కానీ మీ స్థాయికి మేము దిగజారలేం. మాకు రాజకీయ దార్శనికత ఉంది, భావదారిద్ర్యం లేదు” అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇప్పటికే “వర్క్ ఫ్రమ్ హోం” శాఖగా మారిన హోంశాఖ పరిస్థితిని ప్రస్తావించిన చంద్రశేఖర్, ఇకనైనా హోంమంత్రి హోదాకు తగినట్టుగా వ్యవహరించాలని సూచించారు. దళిత ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడకుండా, సుసంగతమైన, గుణప్రదమైన రాజకీయ అలవాట్లు అలవర్చుకోవాలని హితవు పలికారు. హోంమంత్రి ట్వీట్–డిలీట్ ఘటనపై రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతుండగా, అధికార పార్టీ నాయకుల భాషపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment