ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో మరోసారి ఘోర బస్సు ప్రమాదం (Bus Accident) చోటుచేసుకుంది. నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలో ప్రమాదానికి గురి కాగా, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడగా, వారి లగేజీ మొత్తం అగ్నికి ఆహుతైంది.
వివరాల్లోకి వెళితే.. నెల్లూరు నుంచి 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కి బయలుదేరిన ఏఆర్‌బీసీవీఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (ARBCVR Private Travels Bus) బుధవారం అర్ధరాత్రి 2 గంటలు దాటిన తర్వాత నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం శిరివెళ్లమెట్ట వద్ద ప్రమాదానికి గురైంది. ప్రయాణం మధ్యలో బస్సు టైరు పేలడంతో డ్రైవర్ అదుపు తప్పి, డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టాడు.
ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు కంటైనర్ లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే బస్సుకు మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. అయితే అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న డీసీఎం వాహన డ్రైవర్ మానవత్వంతో స్పందించి తన వాహనాన్ని ఆపి, బస్సు అద్దాలను పగులగొట్టడంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడగలిగారు.
కిటికీల్లోంచి దూకేయడంతో పదిమందికిపైగా ప్రయాణికులు స్వల్ప గాయాలపాలయ్యారు. మంటలు మరింతగా వ్యాపించడంతో కంటైనర్ లారీ కూడా పూర్తిగా దగ్ధమైంది. బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్ మరియు క్లీనర్ మృతదేహాలు గుర్తుపట్టలేని స్థాయిలో కాలిపోయాయి. ప్రమాదంలో ప్రయాణికుల లగేజీ మొత్తం బూడిదైంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.









ఆది ‘కమ్మగా’ వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు – ఏపీ బీజేపీ చీఫ్