జీతాల్లేవ్‌.. డిప్యూటీ సీఎం శాఖ‌లో ఖ‌జానా ఖాళీ

జీతాల్లేవ్‌.. డిప్యూటీ సీఎం శాఖ‌లో ఖ‌జానా ఖాళీ

Summarize with AI

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నేతృత్వంలోని పంచాయతీ రాజ్ శాఖ తీవ్ర ఆర్థిక సంక్షోభం ఉంది. వేత‌నాలు కూడా చెల్లించ‌లేని స్థితి ఉన్నామ‌ని ఆ శాఖ ఉన్న‌తాధికారి స్వ‌యంగా హైకోర్టు (High Court)కు వెల్లడించారు. గౌరవ వేతనాలు చెల్లించడానికి అవసరమైన నిధులు లేకపోవడంతో 2024 జూన్ నుంచి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు గౌరవ వేతనాలు ఇవ్వలేకపోతున్నామని పంచాయతీ రాజ్ శాఖ అధికారులు ఏకంగా కోర్టుకు తెలిపారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

కడప జిల్లా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు తమకు నెలలుగా గౌరవ వేతనం చెల్లించడం లేదంటూ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, ప్రజాప్రతినిధులైన వారికి వేతనాలు ఎందుకు నిలిపివేశారన్న అంశంపై స్పష్టమైన సమాధానం ఇవ్వాలని అధికారులను ప్రశ్నించింది. దీనికి ప్రతిస్పందనగా పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ కమిషనర్, బడ్జెట్ కేటాయింపులు లేకపోవడమే ప్రధాన కారణమని కోర్టుకు వివరించారు.

అయితే, ఈ వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు, పూర్తి సమాచారంతో ప్రమాణపత్రం రూపంలో సమగ్ర వివరాలు సమర్పించాలని అధికారులను ఆదేశించింది. కొంత సమయం ఇస్తే గౌరవ వేతనాలు చెల్లించే ప్రయత్నం చేస్తామని కమిషనర్ కోర్టుకు హామీ ఇవ్వడంతో, తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

ఇదిలా ఉండగా, పిటిషనర్లు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాప్రతినిధులకే వేతనాలు చెల్లించలేని ప్రభుత్వం రూ.1,750 కోట్లతో విగ్రహాలు నిర్మిస్తామని ప్రకటించడం హాస్యాస్పదమని వారు వ్యాఖ్యానించారు. త్వరలోనే గౌరవ వేతనాలు చెల్లించకపోతే ప్రజా పోరాటానికి సిద్ధమవుతామని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం తీసుకునే తదుపరి చర్యలపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment