ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మరో కీలక మైలురాయిని చేరుకుంది. భోగాపురం ఎయిర్‌పోర్టులో వాలిడేషన్ (టెస్ట్) ల్యాండింగ్‌గా తొలి విమానం విజయవంతంగా ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానం రన్‌వేపై దిగడంతో విమానాల రాకపోకలకు అధికారికంగా కౌంట్‌డౌన్ మొదలైనట్టయింది. ఈ విమానంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి, ఏటీసీ ఛైర్మన్ పాల్గొన్నారు.
భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు 2023 మే 3న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని అనుమతులతో శంకుస్థాపన చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సుమారు 50 శాతం పనులు పూర్తవ్వగా, కూటమి ప్రభుత్వంలో మరో 46 శాతం పనులు పూర్తి కావడంతో మొత్తం ప్రాజెక్టు 96 శాతం దశకు చేరింది. జీఎంఆర్ సంస్థతో ఒప్పందం చేసుకుని అత్యాధునిక సాంకేతికతతో పనులను వేగవంతం చేయడంలో జగన్ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని వైసీపీ నేతలు చెబుతున్నారు.
భూసేకరణను పక్కాగా పూర్తి చేయడం, కేసులు వేసిన రైతుల డిమాండ్లను పరిష్కరించడం, రెట్టింపు పరిహారం చెల్లించడం వైఎస్ జగన్ పాలనలోనే జరిగింది. ఇళ్లు కోల్పోయిన 376 నిర్వాసిత కుటుంబాలకు దాదాపు రూ.80 కోట్లతో ఆధునిక సౌకర్యాలతో కాలనీలు నిర్మించడమే కాకుండా, ఒక్కో కుటుంబానికి 5 సెంట్ల స్థలం, రూ.8.70 లక్షల పునరావాస పరిహారం అందించామని వైసీపీ వెల్లడిస్తోంది.
2,203 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అత్యాధునిక సదుపాయాలతో రూపుదిద్దుకుంటోంది. భీకర తుఫాన్లను సైతం తట్టుకునేలా, గంటకు 280 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను ఎదుర్కొనేలా ఈ ఎయిర్‌పోర్టును డిజైన్ చేశారు. తొలి దశలో రూ.4,725 కోట్లతో పనులు చేపట్టగా, రోజుకు 200 విమానాలు దిగేలా ఏర్పాట్లు చేశారు.
ప్రారంభ సంవత్సరంలోనే ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించాలనే లక్ష్యంతో ఎయిర్‌పోర్టు నిర్మాణం కొనసాగుతోంది. విమానాశ్రయంలో 14 ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు, రాత్రి పూట 18 విమానాలు పార్కింగ్ చేసే సదుపాయం కల్పించారు. అలాగే ఏటా 20 వేల టన్నుల సరుకు ఎగుమతి చేసే అవకాశాలు ఉండటంతో ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థికాభివృద్ధికి భోగాపురం ఎయిర్‌పోర్టు గేమ్‌చేంజర్‌గా మారనుంది.







