ఇద్దరి (Lovers) ప్రేమికుల (Marriage) వివాహం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాచర్ల (Macherla)కు చెందిన యువతి బంధువులు యువకుడి కుటుంబంపై ఆగ్రహంతో దాడికి పాల్పడిన ఘటన పెద్ద కలకలం రేపుతోంది. వారం రోజుల క్రితం గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన మాధవి (Madhavi), జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రానికి చెందిన నల్ల ముత్తు కుమార్ (Nalla Muthu Kumar) కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లిని అంగీకరించని మాధవి బంధువులు ఆమెను తిరిగి తీసుకెళ్లాలని నిర్ణయించుకుని తీవ్ర ఉద్రిక్తతకు తెరలేపారు.
అందులో భాగంగా యువకుడి ఇంటిపై కర్రలతో దాడి చేశారు. ఈ ఘటన సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డైంది. దాడిలో యువకుడి కుటుంబ సభ్యులు పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. దాడి సమయంలో యువతిని బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లినట్లు గుర్తించారు.
ఆమె ప్రాణాలకు ప్రమాదం ఉండొచ్చని భావించిన ముత్తు కుమార్ కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాధవిని తమ వద్దకు అప్పగించి రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు. ప్రేమ వివాహాన్ని అంగీకరించని యువతి బంధువులు ఈ స్థాయిలో దాడికి దిగడం స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. యువతి బంధువుల దాడి రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దాడికి పాల్పడిన వ్యక్తులను గుర్తించే పనిలో ఉన్నారు. యువతి ఆచూకీ కోసం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. ప్రేమ వివాహం నేపథ్యంలో ఇలా దాడులు, బలవంతపు చర్యలు చోటుచేసుకోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.








