“క్రెడిట్‌ చోరీ స్కీం’’.. చంద్ర‌బాబు నాట‌కాల రాయుడు – జ‌గ‌న్ సెటైర్లు

“క్రెడిట్‌ చోరీ స్కీం’’.. చంద్ర‌బాబు నాట‌కాల రాయుడు - జ‌గ‌న్ సెటైర్లు

సీఎం చంద్రబాబు కథ, స్క్రీన్‌, ప్లే, దర్శకత్వంలో విజయవంతంగా నడుస్తున్న “క్రెడిట్‌ చోరీ స్కీం’’ చాలా బాగుంది అంటూ మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ సెటైర్లు పేల్చారు. నిన్న అన్న‌మ‌య్య జిల్లాలో 3 ల‌క్ష‌ల ఇళ్ల‌కు సీఎం చంద్ర‌బాబు గృహ‌ప్ర‌వేశ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. అయితే 3 లక్షల ఇళ్లులు కట్టాను అని చెప్పుకుంటున్న చంద్ర‌బాబు నాయుడు అసలు వాటికి భూసేకరణ ఎప్పుడు చేశారు, శంకుస్థాపన ఎప్పుడు చేశార‌ని ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబు క్రెడిట్ చోరీ స్కీం హ్యాష్ ట్యాగ్‌తో మాజీ సీఎం చేసిన ట్వీట్ వైర‌ల్‌గా మారింది.

18 నెలల కాలంలో ఒక్క గజం స్థలం కూడా సేకరించకుండా, ఒక్కరికి ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వకుండా, ఒక్కపైసా కూడా ఖర్చుచేయకుండా, ఒక్కరికి ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయకుండా ఎలా క‌ట్టార‌ని చంద్ర‌బాబును వైఎస్ జ‌గ‌న్ ప్ర‌శ్నించారు.

గత వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి స్థలాల్లోనే, వైసీపీ గతంలో శాంక్షన్‌ చేయించిన ఇళ్లను, వైసీపీ హయాంలోనే నిర్మాణంలో ఉన్నవాటిని పట్టుకుని “ఇళ్లన్నీ మేమే కట్టేశాం” అంటూ పచ్చి అబద్ధాలను కళ్లార్పకుండా, ఏ మాత్రం సిగ్గుపడకుండా ఆ క్రెడిట్ త‌న‌దేనంటూ చంద్ర‌బాబు చేస్తున్న క్రెడిట్‌ చోరీ స్కీం హేయంగా ఉందన్నారు. ఇతరుల కష్టాన్ని తన గొప్పతనంగా చెప్పుకునేవాడు నాయకుడు కాదు, నాటకాల రాయుడు అంటూ సెటైర్లు పేల్చారు.

చంద్ర‌బాబు ప్రారంభోత్స‌వం చేసిన‌ 3,00,092 ఇళ్లలో 1,40,010 ఇళ్లు వైసీపీ హయాంలోనే పూర్తయ్యే దశలో ఉన్నవేన‌ని, మరో 87,380 ఇళ్లు శ్లాబ్‌ లెవల్‌ వరకూ త‌మ ప్ర‌భుత్వ‌ హయాంలోనే కట్టించినవేన‌ని, శ్లాబ్‌ కంటే కింద స్థాయిలో మరో 66,845 ఇళ్లు గ‌త ప్ర‌భుత్వ‌ హయాంలో నిర్మాణంలో ఉన్నవేన‌ని వైఎస్ జ‌గ‌న్ చెప్పారు.

2023 అక్టోబరు 12న ఒకేసారి 7,43,396 ఇళ్లలో ఒకేరోజు గృహప్రవేశాలతో వైసీపీ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని, ఇన్ని వాస్తవాలు కళ్ళముందే ఉన్నా, అసలు వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయనట్టుగా, మీరే అన్నీ చేసినట్టుగా పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్న చంద్ర‌బాబు క్రెడిట్ చోరీ స్కీం చాలా హేయమ‌న్నారు.

వైసీపీ హయాంలో 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మలకు ఇచ్చి, వారి పేరుమీదే రిజిస్ట్రేషన్‌ చేయించామ‌ని, అందులో 21.75 లక్షల ఇళ్లను శాంక్షన్‌ చేయించి, కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొంటూ 9 లక్షలకుపైగా ఇళ్లను పూర్తిచేశామ‌ని చెప్పారు. మిగిలిన ఆ 10 లక్షల ఇళ్ల స్థలాల్లో పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చే కార్యక్రమానికి పూనుకోకుండా, ఆ ఖాళీ స్థలాలను లాక్కునే కార్యక్రమం చేస్తున్న మీరు సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి, నిస్సిగ్గుగా క్రెడిట్ చోరీకి పాల్పడ్డం అత్యంత హేయమ‌ని సీఎం చంద్ర‌బాబుపై మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ చేసిన ట్వీట్ సంచ‌ల‌నంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment