మన్యం జిల్లా (Manyam District)లో మరణ మృదంగం భయభ్రాంతులకు గురిచేస్తోంది. గిరిజన ప్రాంతాల్లో (Tribal Areas) విద్యార్థుల (Students) మరణాలు (Deaths) ఆగడం లేదు. కలుషిత (Contaminated) నీరు(Water), పారిశుద్ధ్య (Sanitation) లోపాలు, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా చిన్నారుల ప్రాణాలు పోతున్నాయని తల్లిదండ్రులు కన్నీరుపెట్టుకుంటున్నారు. మన్యం జిల్లాలోని గిరిజన పాఠశాలల్లో వ్యాధులు వ్యాపించి ఇప్పటివరకు ఆరుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.
తాజాగా మక్కువ మండలం ఎర్రసామంత వలస ఆశ్రమ పాఠశాల 6వ తరగతి విద్యార్థి తాడంగి చిన్నారి (పచ్చకామెర్లు) మృతి చెందగా, సాలూరు మండలం మామిడిపల్లి ఆశ్రమ పాఠశాల 7వ తరగతి విద్యార్థిని తాడంగి పల్లవి (12) మెదడు వాపు వ్యాధి తో ప్రాణాలు కోల్పోయింది.
చిన్నారి స్కూల్‌లో అనారోగ్యానికి గురై, సాలూరు ప్రభుత్వ ఆస్పత్రి నుండి విశాఖ KGH కి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మెదడు వాపు వ్యాధితో బాధపడుతున్న విద్యార్థిని పల్లవి(Pallavi) ఈ నెల 6న బొబ్బిలి ఆస్పత్రిలో చేరి, 11న కేజిహెచ్(KGH) తరలించగా 12న చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది.
ఇప్పటివరకు మరణించిన విద్యార్థుల వివరాలు
| విద్యార్థి పేరు | తరగతి / విద్య | ఊరు | మండలం | వ్యాధి |
|---|---|---|---|---|
| తోయక అంజలి | 10వ తరగతి | కంబగూడ | గుమ్మలక్ష్మీపురం | పచ్చకామెర్లు |
| తోయక కల్పన | 10వ తరగతి | దండుసూర | కురుపాం | పచ్చకామెర్లు |
| నిమ్మక సుమన్ | డిగ్రీ పూర్తి | బాలేసు | గుమ్మలక్ష్మీపురం | పచ్చకామెర్లు |
| నిమ్మక ప్రశాంత్ | డిగ్రీ పూర్తి | చినదోడిజ | జియ్యమ్మవలస | పచ్చకామెర్లు |
| తాడంగి పల్లవి | 7వ తరగతి | మామిడిపల్లి | సాలూరు | మెదడు వాపు వ్యాధి |
| తాడంగి చిన్నారి | 6వ తరగతి | ఎర్రసామంత వలస | మక్కువ | పచ్చకామెర్లు |
తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన.. ప్రభుత్వ స్పందన కరువు
”ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మా పిల్లలు ఇలా ప్రాణాలు కోల్పోతున్నారు. స్కూల్‌లలో నీరు తాగడానికి పనికిరావడం లేదు. పారిశుద్ధ్యం లేక విద్యార్థులు వ్యాధులు బారిన పడుతున్నారు” అని వాపోతున్నారు. కనీసం సురక్షిత మంచినీరు కూడా అందించడం లేదని మండిపడుతున్నారు. కళ్ల ముందే తమ పిల్లలు పిట్టల్లా రాలిపోతుంటే బాధిత తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ప్రభుత్వ పెద్దలు మాత్రం పరామర్శలు చేస్తున్నారే తప్ప, విద్యార్థుల ప్రాణాలు కాపాడేందుకు కనీస ప్రయత్నాలు కూడా చేయడం లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి భరోసా అందలేదని మండిపడుతున్నారు.
మెదడు వాపు వ్యాధి, పచ్చకామెర్లు వంటి వ్యాధులు గిరిజన ప్రాంతాల్లో వేగంగా వ్యాపిస్తున్నాయని స్థానిక వైద్య అధికారులు అంగీకరిస్తున్నారు. తక్షణ చర్యలు తీసుకోకపోతే మరిన్ని ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉందని గిరిజన ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఇద్దరి విద్యార్థుల మరణంతోనైనా ప్రభుత్వంలో చలనం వస్తుందా అని గిరిజనులు నిలదీస్తున్నారు.








