ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఉపాధ్యాయ సంఘాలు (Teachers’ Associations) కూటమి ప్రభుత్వంపై (Coalition Government), ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh)పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. “ఉపాధ్యాయులను తరగతి గదులకే పరిమితం చేయాలి, బోధనేతర పనుల నుండి విముక్తి కల్పించాలి” అని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఛైర్మన్ సాయి శ్రీనివాస్ (Sai Srinivas) డిమాండ్ చేశారు. “దయచేసి మమ్మల్ని పాఠాలు చెప్పనివ్వండి, యాప్‌ల భారం తగ్గించండి” అని ఆయన విజ్ఞప్తి చేశారు.
విజయవాడ ధర్నాచౌక్‌లో రాష్ట్రంలోని ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలపై ప్రభుత్వ మొండివైఖరికి నిరసనగా ఉపాధ్యాయ సంఘాలు ధర్నా చేపట్టాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాలు పలు కీలక డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచాయి. మెరుగైన పీఆర్సీ, మధ్యంతర భృతి మంజూరు చేయాలని, ప్లస్-2 పాఠశాలలను కొనసాగించాలని, గురుకుల, ఆదర్శ, 1998, 2008 డీఎస్సీ టీచర్ల పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని కోరాయి.
అదే విధంగా “యాప్ (Apps) ల పేరుతో ఉపాధ్యాయులను వేధించడం ఆపాలి. యాప్‌ల భారం తగ్గించకపోతే అన్ని యాప్‌లను బహిష్కరిస్తాం. ఇకపై కేవలం విద్యార్థులు, ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన పథకం వివరాలే యాప్‌లలో నమోదు చేస్తాం” అని హెచ్చరించారు.
వైసీపీ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ కుమార్ రెడ్డి (Ashok Kumar Reddy) మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని, ఎన్నికల ముందు చంద్రబాబు డైరెక్ట్ పీఆర్సీ ఇస్తామన్నారని గుర్తుచేశారు. 15 నెలలుగా మాట తప్పుతున్నారని, ఈ విషయంపై ఉపాధ్యాయులతో ఒక్కసారి కూడా చర్చించలేదని చెప్పారు. “పాత ఆవు పాలు సరిగా ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయులు కొత్త ఆవు కొన్నారు, కానీ కొత్త ఆవు పాల పొదుగు దగ్గరకు రాకముందే కాళ్లతో తంతోంది. యాప్‌లతో ఉపాధ్యాయులను వేధిస్తోంది” అని ఆయన సెటైర్లు వేశారు.
యుటిఎఫ్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. “అధికారంలోకి రాకముందు యాప్‌లను రద్దు చేస్తామన్నారు, కానీ అధికారంలోకి వచ్చాక యాప్‌ల పేరుతో వేధిస్తున్నారు. గిన్నిస్ బుక్ పేరుతో ఉపాధ్యాయులతో ఆడుకుంటున్నారు” అని మండిపడ్డారు. యాప్‌ల ద్వారా పిల్లలకు అక్షరాలొస్తాయా? మంత్రి నారా లోకేష్ సమాధానం చెప్పాలి. వారం రోజుల్లో మా డిమాండ్లపై స్పందించాలి. లేనిపక్షంలో ఉపాధ్యాయులంతా రోడ్లపైకి వస్తారు” అని హెచ్చరించారు.








