రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి నిరాశ ఎదురైంది. ఎప్పటిలాగే ఈసారి కూడా ఉద్యోగుల డి.ఏ (డియర్‌నెస్ అలవెన్స్), ఐఆర్ (ఇంటరిం రిలీఫ్), పిఆర్‌సి (పే రివిజన్ కమిషన్) అంశాలను చంద్రబాబు క్యాబినెట్ పట్టించుకోలేదు. ఇటీవల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో చీఫ్ సెక్రటరీ వినాయనంద్ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపారు. ఈరోజు జరిగే క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగుల ప్రయోజనాలపై నిర్ణయాలు వస్తాయని ఉద్యోగ సంఘాలు ఆశించాయి. అయితే డి.ఏపై కూడా చర్చించకపోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
“ఉద్యోగులంటే ప్రభుత్వం కి ఇంత నిర్లక్ష్యమా?” అని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. “నిన్న చర్చిస్తామని చెప్పి ఈరోజు కనీసం ఒక డి.ఏ కూడా ఆమోదించలేదు. 15 నెలలుగా ఒక్క డి.ఏ ఇవ్వలేదు. ఐఆర్ లేదు, పిఆర్‌సి కమిషన్ వేయలేదు. ఇలా అయితే ఉద్యోగులు రోడ్డెక్కాల్సి వస్తుంది” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగులు చెబుతున్న మరో ముఖ్యమైన అంశం ఏంటంటే.. ప్రభుత్వమే పనిభారం పెంచుతూ, వారి సమస్యలను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. “శ్రీశైలంలో టీడీపీ ఎమ్మెల్యే ఉద్యోగులను కొడితే చర్యలు తీసుకోరు. టీడీపీ ఎమ్మెల్యే కేజీవీబీ ప్రిన్సిపల్‌ను వేధించినా చర్యలు తీసుకోరు. ఇలాంటి పరిస్థితుల్లో మేమెలా పనిచేయాలి?” అని ప్రశ్నించారు. దీంతో ఉద్యోగ సంఘాలు త్వరలోనే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టే అవకాశముందని సమాచారం.








