ఇటీవల కాలంలో దేశంలో భార్యల చేతుల్లో భర్తల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీమూన్ మర్డర్ అనంతరం అలాంటి ఉదంతాలు రోజుకొకటి బయటకొస్తున్నాయి. తాజాగా యూట్యూబ్ (YouTube)లో చూసి భర్త (Husband)ను హత్య చేసిన ఘటన కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలో సంచలనంగా మారింది. గ్రంథాలయంలో స్వీపర్‌గా పనిచేస్తున్న సంపత్ (45) అనే వ్యక్తి భార్య, ఆమె ప్రియుడి చేతుల్లో హతమయ్యాడు.
వివరాల్లోకి వెళితే.. భార్య రమాదేవి, ఇద్దరు పిల్లలతో కరీంనగర్ జిల్లా కేంద్రంలో నివసిస్తున్నాడు సంపత్. స్వీపర్ (Sweeper)గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఒక సర్వపిండి అమ్మకందారైన కర్రె రాజయ్య (50)తో సంపత్ భార్య రమాదేవి (Ramadevi) వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అయితే వారి అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ఎలాగైనా తొలగించాలనే దుష్ట ఉద్దేశంతో రమాదేవి యూట్యూబ్‌లో హత్య మార్గాలను రీసెర్చ్ చేసి పథకం వేసింది.
యూట్యూబ్ వీడియోల ద్వారా “చెవిలో పురుగుల మందు లేదా గడ్డి మందు పోస్తే చనిపోతాడు” అనే తప్పుడు సమాచారం నమ్మిన రమాదేవి, తన ప్రియుడు రాజయ్యకు అదే విధంగా హత్య చేయమని సూచించింది. బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద మద్యం తాగించి.. మత్తులో కింద పడిన సంపత్ చెవిలో గడ్డి మందు పోసి చంపేశారు. అనంతరం తన భర్త సంపత్ కనిపించడం లేదని రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు మొదట్లో అనుమానం లేకుండా దర్యాప్తు సాగించారు. కానీ రమాదేవి మృతదేహానికి పోస్టుమార్టం చేయవద్దని కోరడంతో అసలు విషయం బయటపడింది. కాల్ డేటా, ఫోన్ లొకేషన్, సీసీటీవీ ఆధారాలతో ముగ్గురినీ అరెస్టు చేసిన పోలీసులు.. విచారణలో వారే హత్య చేసినట్లు అంగీకరించడంతో వారిని రిమాండుకు తరలించారు. ఘటనపై మరింత విచారణ కొనసాగుతోంది.








