వ్యాపారం ఏదైనా వాటాలు అందాల్సిందే. కాదూ, కూడదు అంటే ఆ వ్యాపారానికి అదే ఆఖరి రోజు. కాదేదీ కమీషన్లకు అనర్హం అన్నట్లుగా ఆళ్లగడ్డలో అధికార పార్టీ MLA భర్త వసూళ్ల దందా కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారం ఉన్నప్పుడే అందినకాడికి దోచుకోవాలన్న విధానంతో ఆఖరికి చికెన్ షాపులను కూడా వదలట్లేదు. కేజీ చికెన్ అమ్మితే రూ.10 పంపించాల్సిందేనట.
తాజాగా, హోల్‌సేల్ చికెన్ వ్యాపారులకు ఒత్తిళ్లు తీసుకొచ్చిన ఘటన కలకలం రేపుతోంది. నియోజకవర్గంలోని చికెన్ వ్యాపారులు కిలోకు రూ.10 చొప్పున కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, ప్రత్యేకంగా తాను గోవా నుంచి తెప్పించే చికెన్‌ను మాత్రమే అమ్మాలని కూడా ఆదేశించారు. వ్యాపారులు దీనిని నిరాకరించడంతో వెంటనే అధికారులపై ఒత్తిడి తెచ్చి, అనుమతులు లేవంటూ నోటీసులు ఇచ్చి దుకాణాలను మూసివేయించారు.
చికెన్ సెంటర్ యాజమాన్యం ట్రేడ్ లైసెన్స్ కోసం మున్సిపల్ కార్యాలయాన్ని అనేకసార్లు సంప్రదించినా స్పందన రాలేదు. చివరికి కోర్టు ఆశ్రయించి అనుమతులు తెచ్చుకున్నప్పటికీ, లైసెన్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. చివరకు జిల్లా కలెక్టర్ మందలింపుతో అనుమతులు మంజూరయ్యాయి. దీంతో వ్యాపారులు తమకేమీ ఇబ్బంది లేదనుకుంటున్న సమయంలో శనివారం రాత్రి మళ్లీ కొత్త ఆరోపణలు తెరపైకి వచ్చాయి.
ఆళ్లగడ్డలో అమ్ముతున్న చికెన్ మనుషులకు ముప్పు కలిగిస్తోందని విజయవాడలోని పశు సంవర్ధక శాఖ లాబొరేటరీ నివేదిక ఇచ్చిందని మున్సిపల్, రెవెన్యూ, ఫుడ్ అధికారులు దుకాణాలపై దాడులు చేయించారు. పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని నాలుగు చికెన్ దుకాణాలను మూసివేశారు. అధికార పార్టీ నేతతో ఒప్పందం కుదరనందుకే వ్యాపారులను లక్ష్యంగా చేసుకున్నారని, ఇది కమీషన్ రాజకీయాలకు మరో ఉదాహరణగా మారిందని స్థానికులు అంటున్నారు.








