హ‌లో ఇండియా..!! సోషల్ మీడియా అణిచివేతపై జగన్ సంచ‌ల‌న ట్వీట్‌

హ‌లో ఇండియా..!! సోషల్ మీడియా అణిచివేతపై జగన్ సంచ‌ల‌న ట్వీట్‌

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) నేతృత్వంలోని టీడీపీ(TDP) కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విలువలని తుంగలో తొక్కుతోందని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) ఆరోపించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ‘హలో ఇండియా’ (Hello India) అంటూ జ‌గ‌న్ చేసిన ట్వీట్‌ సోషల్ మీడియా వైర‌ల్‌గా మారింది. పోలీసు యంత్రాంగాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకుంటూ, భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నారని మండిపడ్డారు.

రాజకీయ ఏజెంట్లుగా పోలీసులు
ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన వాక్ స్వాతంత్య్రాన్ని (ఆర్టికల్-19) హరించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని జగన్ పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే సోషల్ మీడియా కార్యకర్తలు, వైఎస్సార్‌సీపీ(YSRCP) మద్దతుదారులు మరియు పాత్రికేయులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.

టీడీపీ(TDP) నాయకులు ఫిర్యాదు చేయడమే ఆలస్యం అన్నట్లుగా పోలీసులు శరవేగంగా స్పందిస్తూ, కోర్టుల మార్గదర్శకాలను పట్టించుకోకుండా ఎఫ్‌ఐఆర్‌లు (FIR) నమోదు చేస్తున్నారని విమర్శించారు. సోషల్ మీడియా వేదికలకు పోలీసులే స్వయంగా నోటీసులు పంపి, కంటెంట్‌ను తొలగించాలని, ఖాతాలను బ్లాక్ చేయాలని ఆదేశించడం ద్వారా అప్రకటిత సెన్సార్‌షిప్ విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ద్వంద్వ ప్రమాణాలు – వ్యక్తిత్వ హననం
టీడీపీకి చెందిన సామాజిక మాధ్యమాలు నిత్యం వైసీపీ నేతలపై విషం చిమ్ముతున్నాయని, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. “టీడీపీ నేతలు చేస్తున్న అసభ్యకర పోస్టులపై మేము ఎన్ని ఫిర్యాదులు చేసినా, సాక్ష్యాధారాలు చూపినా పోలీసులు కనీసం పట్టించుకోవడం లేదు. ఎఫ్‌ఐఆర్‌ల ఊసే లేదు. పోలీసు వ్యవస్థలో కనిపిస్తున్న ఈ ద్వంద్వ ప్రమాణాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం” అని ఆయన పేర్కొన్నారు.

ప్రజాస్వామ్య మనుగడ కష్టం
విమర్శను నేరంగా పరిగణించే రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉనికిపైనే సందేహాలు కలుగుతున్నాయని జగన్ అభిప్రాయపడ్డారు. స్వేచ్ఛ స్థానంలో భయం, జవాబుదారీతనం స్థానంలో బెదిరింపులు రాజ్యమేలుతున్నాయని దుయ్యబట్టారు. పోలీసులను రాజకీయ ఆయుధాలుగా వాడుకోవడం ఆపాలని, ప్రతిపక్షాల గొంతు నొక్కే చర్యలను తక్షణమే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ పోకడలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రజల గొంతును అణిచివేసే ప్రయత్నాలను సాగనివ్వబోమని వైఎస్ జగన్ హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment