మెగా డీఎస్సీ కాదు.. మెగా లీక్, మెగా అవినీతి – వైఎస్ జగన్ సీరియ‌స్‌

మెగా డీఎస్సీ కాదు.. మెగా లీక్, మెగా అవినీతి - వైఎస్ జగన్ సీరియ‌స్‌

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ఇటీవల నిర్వహించిన డీఎస్సీ (DSC) పరీక్షల వ్యవహారం ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతోంది. డీఎస్సీ పరీక్షల లీకులు (DSC Leaks), డేటాబేస్ (Database) నుంచి టాపర్ల వివరాల మాయంపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారమంతటా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) నేతృత్వంలో “డార్క్ ఆపరేషన్”(Dark Operation) సాగిందని ఆరోపిస్తూ.. ఆయన్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని, ఈ స్కామ్‌పై సీబీఐ (CBI) విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదిక‌గా విరుచుకుప‌డ్డారు.

చంద్రబాబూ.. ఇది మెగా డీఎస్సీనా? దగా డీఎస్సీనా?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును (Nara Chandrababu Naidu) ఉద్దేశించి వైఎస్ జగన్ (YS Jagan) నేరుగా ప్రశ్నల వర్షం కురిపించారు. “మా హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దుచేసి, ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తూ, కొత్తగా మళ్లీ నోటిఫికేషన్‌ ఇచ్చి పబ్లిసిటీకి వాడుకున్నారు. తీరా పరీక్షల్లో మీరు చేసిన నిర్వాకాలు, స్కాంలతో ఉద్యోగార్థులకు ద్రోహం చేయలేదా?” అని నిలదీశారు. పేప‌ర్లు లీక్.. డేటా డిలీట్.. మెరిట్ లిస్టు మాయం.. దీనిపై మీ సమాధానం ఏంటని ప్రశ్నించారు.

వైఎస్ జగన్ సంధించిన ఐదు కీలక ప్రశ్నలు

  • పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్న ఒక SCERT అవుట్‌ సోర్సింగ్‌ (Outsourcing) ఉద్యోగికి మొదటి ర్యాంకు ఎలా వచ్చింది? ఆ తర్వాత ఆ వివరాలను డేటాబేస్‌ నుంచి ఎందుకు డిలీట్‌ చేశారు?
  • టాపర్‌ వివరాలను ఎందుకు తొలగించారు? సెలెక్ట్‌ అయిన వారికి మాత్రమే నేరుగా మెసేజ్‌లు ఎందుకు పంపారు? కలెక్టర్‌ కార్యాలయాల్లో ఎంపికైన వారి జాబితాలు ఎందుకు పెట్టలేదు? ఇందులో పారదర్శకత ఎక్కడ ఉంది?
  • ఒక్కో పోస్టును రూ.15 లక్షలకు “స్పోర్ట్స్ కోటా’’ (Sports Quota) కింద బేరసారాలు ఆడ సాగింది వాస్తవం కాదా? మీ పార్టీకి చెందిన నాయకుడే ఇంటికి పిలిచి ఈ డీల్స్‌ కుదిర్చిన మాట నిజం కాదా? ఎప్పుడూ క్రీడా మైదానంలో అడుగు పెట్టని వాళ్లకు కూడా ఫేక్‌ సర్టిఫికెట్లు ఎలా ఇచ్చారు? ఇది రిక్రూట్‌మెంటా.. లేక వేలం పాటా?
  • టెట్‌ (TET) కన్వీనర్‌గా ఉన్న అధికారే డీఎస్సీ పరీక్షకూ కన్వీనర్‌ అయినప్పటికీ, ఉన్నపళంగా ఆయన్ను తొలగించి విద్యా శాఖలోని జాయింట్‌ డైరెక్టర్‌ను డీఎస్సీ కన్వీనర్‌గా ఎందుకు పెట్టారు? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి?
  • మీ సుపుత్రుడి (నారా లోకేష్) శాఖలో లీకులతో సాగిన ఈ ‘‘డార్క్‌ ఆపరేషన్‌’’ను ఎందుకు దాచిపెడుతున్నారు?

లోకేష్‌ను తప్పించి.. సీబీఐ విచారణ జరపాలి!
ఈ డీఎస్సీ వ్యవహారం మొత్తం “మెగా డీఎస్సీ(Mega DSC).. మెగా లీక్.. మెగా అవినీతి(Mega Leak)” గా మారిందని వైఎస్ జగన్ అభివర్ణించారు. ఈ భారీ అవినీతికి నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్‌ను వెంటనే మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న ఈ లీకుల వ్యవహారంపై తక్షణమే సీబీఐ(CBI) దర్యాప్తునకు ఆదేశించాలన్నారు. కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, రాత్రింబవళ్లు కష్టపడి చదివి ప్రతిభ చూపిన అసలైన అభ్యర్థులకు న్యాయం చేయాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment