‘సీట్లు బిచ్చం కావు’.. ‘స్థానిక’ వాటాపై ప‌వ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

'సీట్లు బిచ్చం కావు'.. 'స్థానిక' వాటాపై ప‌వ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) వేడి పెరుగుతున్న వేళ కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం అంశం కీలకంగా మారింది. ఇంతకాలం క్షేత్రస్థాయి నాయకులు, ద్వితీయ శ్రేణి కార్యకర్తలకే పరిమితమైన నిరసన స్వరం, ఇప్పుడు ఏకంగా అధినాయకత్వం స్థాయిలోనే బయటపడటం సంచలనం రేపుతోంది. తాజాగా కాకినాడలో(Kakinada) జరిగిన జనసేన పార్టీ (Jana Sena Party) అంతర్గత సమావేశంలో అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలు కూటమిలో సీట్ల వాటాల్లో విభేదాలను, పెరుగుతున్న ఉద్రిక్తతలను స్పష్టంగా వేలెత్తి చూపుతున్నాయి.

‘సీట్లు బిచ్చం కావు’.. పవన్ ఘాటు వ్యాఖ్యలు
కాకినాడ వేదికగా జరిగిన అంతర్గత చర్చల్లో పవన్ కల్యాణ్ నేరుగా టీడీపీ(TDP) వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జనసేనకు క్షేత్రస్థాయిలో బలం ఉన్న నియోజకవర్గాల్లో సీట్ల కేటాయింపుపై పట్టుబట్టాలని స్థానిక నాయకులకు దిశానిర్దేశం చేశారు. సీట్లనేవి ఎవరో ఇచ్చే బిచ్చం, వరమూ కాదని, స్వశక్తితో సాధించుకోవాల్సిన హక్కు అని స్పష్టం చేశారు.

ఒకవేళ పొత్తులో భాగంగా టీడీపీ సరైన ప్రాధాన్యత ఇవ్వకపోయినా, డిమాండ్ చేసిన స్థానాలను నిరాకరించినా జనసేన క్యాడర్ మాత్రం ‘స్నేహపూర్వక పోటీ’కి సైతం వెనుకాడవద్దని కార్యకర్తలకు పిలుపునివ్వడం చర్చనీయాంశం. గతంలో చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం తానే స్వయంగా ముందుకొచ్చి మద్దతుగా నిలిచానని గుర్తుచేసిన ఆయన, ఇప్పుడు పార్టీ ఉనికిని, గౌరవాన్ని కాపాడుకోవడానికి పట్టుదలతో నిలబడాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు.

కూటమి ఐక్యతపై భిన్నాభిప్రాయాలు
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పైకి కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా గంభీరంగా మాట్లాడినప్పటికీ, లోపల మాత్రం నారా లోకేష్(Nara Lokesh)ప్రతిపాదించిన 15 శాతం సీట్ల వాటాకే పవన్ నర్మగర్భంగా అంగీకరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తీవ్ర నిరాశలో ఉన్న పార్టీ శ్రేణులు ఇంకా నైరాశ్యంలో కూరుకుపోకుండా బ‌లం ఉన్న చోట పోటీకి సిద్ధంగా ఉండాల‌నే డిమాండ్‌ను తెరపైకి తెచ్చారని, అంతిమంగా మాత్రం టీడీపీ సూచించిన వాటాకే ప‌రిమితం అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌ని, కూటమి సమన్వయం కోసమే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారని విశ్లేషిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి, ముఖ్యంగా టీడీపీ(TDP) నుంచి వస్తున్న నాయకులను చేర్చుకోవాలని కొందరు ఇస్తున్న సలహాలను పవన్ ప్రస్తావించడం ద్వారా, స్థానిక స్థాయిలో జనసేన ప్రాబల్యాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సంకేతమిచ్చారు.

అయోమయంలో క్షేత్రస్థాయి శ్రేణులు
ఒకవైపు కూటమి కోసం కలసి పనిచేయాలని చెబుతూనే, మరోవైపు స్నేహపూర్వక పోటీకి సిద్ధపడాలని స్పష్టం చేయడం పార్టీ కోసం 12 ఏళ్లుగా శ్ర‌మిస్తున్న జ‌న‌సేన‌ శ్రేణులలోనూ తీవ్ర అనిశ్చితికి దారితీస్తోంది. ప్రధాన భాగస్వామి అయిన టీడీపీ నుంచి ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత దక్కకపోవడం, సీట్ల సర్దుబాటుపై సందిగ్ధత కొనసాగుతుండటంతో రాబోయే రోజుల్లో ఈ విభేదాలు మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విమ‌ర్శ‌కుల అంచ‌నా.

Join WhatsApp

Join Now

Leave a Comment