ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) అప్పుల భారం(Debt Burden) మరోసారి చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Government) అధికారంలోకి వచ్చిన 27 నెలల్లోనే అప్పులు రూ.3.97 లక్షల కోట్లకు చేరగా, ఈ గణాంకాలు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. తాజాగా ఈ మంగళవారం మరో రూ.2,600 కోట్ల రుణాన్ని రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank) నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల వేలం (State Government Securities Auction) ద్వారా సమీకరించిన నేపథ్యంలో.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చ మరింత తీవ్రమైంది.
27 నెలల్లో ఎడాపెడా దాదాపు రూ.3.97 లక్షల కోట్ల మేర అప్పులు తెచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. ఆ మొత్తాన్ని ఏ రంగాలకు కేటాయించింది? ఎంత మొత్తాన్ని మూలధన వ్యయానికి ఉపయోగించింది? ఎంత మొత్తం సంక్షేమ పథకాలకు (Welfare Schemes) ఖర్చు చేసింది? అనే వివరాలను ప్రజల ముందు స్పష్టంగా ఉంచాల్సిన బాధ్యత కూడా ఉంది.
ఇప్పటి వరకు బడ్జెటరీ అప్పులు (Budgetary Borrowings) సుమారు రూ.2.24 లక్షల కోట్లకు చేరగా, వివిధ కార్పొరేషన్ల ద్వారా మరో రూ.1.25 లక్షల కోట్ల వరకు రుణాలు సమీకరించింది. అమరావతి (Amaravati) పేరుతోనే రూ.47,687 కోట్ల మేర అప్పులు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇలా వేర్వేరు మార్గాల్లో అప్పులు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం వాటిని ఎక్కడ ఖర్చు చేస్తోందని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
జగన్ హయాంలో డీబీటీ అమలు
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో (YSRCP Government) వివిధ సంక్షేమ పథకాల (Welfare Schemes)ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ కొనసాగేది. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం నెలకో పథకం డీబీటీ (DBT) రూపంలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరిపోయేది. రైతులు, విద్యార్థులు, మహిళలు, మత్స్యకారులు, చిరువ్యాపారులు, పేద కుటుంబాల కోసం ప్రభుత్వం నుంచే నేరుగా నగదు బదిలీ జరిగేది.
డీబీటీ పద్ధతిలో జగన్ ప్రభుత్వంలో(Jagan Government) ఏకంగా రూ.2,73,756 కోట్లు రాష్ట్ర ప్రజలకు అందాయి. నాన్ డీబీటీ ద్వారా రూ.1,84,604 కోట్లు అందించారు. మొత్తంగా తన ఐదేళ్ల పాలనలో జగన్ డీబీటీ+నాన్ డీబీటీ ద్వారా ఏకంగా రూ.4,58,360 కోట్లు ప్రజలకు అందించారని గణాంకాలు చెబుతున్నాయి. జగన్ హయాంలో చేసిన అప్పు కూడా 3,32,671 కోట్లు మాత్రమేనని అసెంబ్లీ సాక్షిగా కూటమి ప్రభుత్వ ఆర్థిక మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే.
అప్పులకు హద్దు ఎక్కడ?
చంద్రబాబు ప్రభుత్వంలో 27 నెలల్లోనే ఏకంగా రూ.3.97 లక్షల కోట్లకు అప్పు పెరిగిపోవడంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఆదాయం పెరగకుండా అప్పులు పెరుగుతూ పోతే.. భవిష్యత్తులో వడ్డీల చెల్లింపుల భారం పెరిగే అవకాశం ఉంటుంది. అప్పు ఎంత చేశారన్నదే కాదు.. ఆ అప్పుతో ప్రజలకు ఏం అందిస్తున్నారు? రాష్ట్ర ఆదాయం ఎలా పెరగబోతోంది? ఆ అప్పును ఎలా తిరిగి చెల్లించబోతున్నారు? అని ప్రశ్నలు చంద్రబాబు ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయి.
- ప్రజలకు లెక్క చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
అప్పులు పెరుగుతున్న వేగానికి తగ్గట్టుగా రాష్ట్ర ఆదాయం పెరుగుతోందా? - అప్పుల భారం పెరుగుతున్న వేళ ప్రజలకు అందుతున్న ప్రయోజనాలు ఏమిటి?
- భవిష్యత్ తరాలపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం వద్ద ఉన్న ప్రణాళిక ఏమిటి?
- రూ.4 లక్షల కోట్లకు చేరువవుతున్న అప్పుల నేపథ్యంలో.. అప్పు తీసుకున్న ప్రతి రూపాయికి ప్రజలకు లెక్క చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని ఆర్థిక మేధావులు హెచ్చరిస్తున్నారు.








‘సీట్లు బిచ్చం కావు’.. ‘స్థానిక’ వాటాపై పవన్ కీలక వ్యాఖ్యలు