‘వీఆర్‌కే డైట్’పై వివాదం.. వీరమాచినేనిపై కేసు

‘వీఆర్‌కే డైట్’పై వివాదం.. వీరమాచినేనిపై కేసు

Summarize with AI

‘వీఆర్‌కే డైట్’, ‘వీరమాచినేని డైట్’ పేరుతో ప్రచారం పొందిన వీరమాచినేని రామకృష్ణపై సైబరాబాద్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో కొవ్వు, ప్రొటీన్ ఆధారిత ఆహారంతో అనారోగ్యాలను నయం చేయవచ్చంటూ ఆయన చేస్తున్న ప్రచారాన్ని చూసిన నిర్మల్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల న్యాయ విద్యార్థి ఆయనను సంప్రదించినట్లు పోలీసులు తెలిపారు.

టైప్-1 డయాబెటిస్‌తో ఇన్సులిన్ తీసుకుంటున్న బాధితుడికి రామకృష్ణ, కోటేశ్వరరావు కలిసి వ్యాధి నయం అవుతుందని చెప్పి కొన్ని ఆహార సూచనలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇన్సులిన్‌తో పాటు ఇతర మందులు వాడకూడదని, సూచించిన డైట్ మాత్రమే పాటించాలని చెప్పడంతో పాటు రూ.26 వేలు ఫీజుగా తీసుకున్నారని బాధితుడు ఆరోపించారు.

ఈ నెల 12న సూచించిన డైట్‌ను ప్రారంభించిన అనంతరం రెండు రోజుల్లోనే తీవ్ర డీహైడ్రేషన్‌కు గురై ఆసుపత్రిలో చేరినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. చికిత్స కోసం రూ.58 వేలకు పైగా ఖర్చయిందని, తనకు ఎదురైన ఆరోగ్య సమస్యలకు సూచించిన డైట్ కారణమని ఆరోపిస్తూ ఈ నెల 24న రాయదుర్గం పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో అనధికార వైద్య సలహాలు ఇస్తున్నారంటూ హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ దాఖలు చేసిన మరో కేసు విచారణను సిటీ సివిల్ కోర్టు నవంబర్ 25కు వాయిదా వేసి, వీరమాచినేనికి సమన్లు జారీ చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment