విశాఖలో వాటర్ ఎమర్జెన్సీ.. ఇబ్బందుల్లో 3 ల‌క్ష‌ల కుటుంబాలు

విశాఖలో వాటర్ ఎమర్జెన్సీ.. ఇబ్బందుల్లో 3 ల‌క్ష‌ల కుటుంబాలు

Summarize with AI

గ్రేటర్ విశాఖపట్నం నగరపాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో తాగునీటి సరఫరా సమస్య తీవ్రమైన సంక్షోభంగా మారింది. జీవీఎంసీ వాటర్ సప్లై ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల నిరవధిక సమ్మె కారణంగా నగరంలోని సుమారు మూడు లక్షల ఇంటి కులాయిలకు మంచినీటి సరఫరా నిలిచిపోయింది. జీవీఎంసీ మేయ‌ర్‌తో వాట‌ర్ సప్లై ఉద్యోగుల చ‌ర్చ‌లు విఫ‌ల‌మ‌వ్వ‌డం, స‌మ్మె చేస్తే ఉద్యోగాలు పీకేస్తాన‌ని మేయ‌ర్ బెదిరించ‌డంతో వారు ఉద్య‌మాన్ని ఉధృతం చేశారు. విశాఖ నగర చరిత్రలో తాగునీటి సరఫరా పూర్తిగా ఆగిపోవడం ఇదే మొదటిసారి అని ప్ర‌జ‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వాట‌ర్ ఉద్యోగుల స‌మ్మె కార‌ణంగా హెచ్‌పీసీఎల్, కోరమండల్ ఫెర్టిలైజర్స్, ఎస్సార్, ఆర్‌సీఎల్, విశాఖపట్నం పోర్ట్ వంటి కీలక పరిశ్రమలతో పాటు, ఎంఈఎస్, ఎన్‌ఎస్‌టీఎల్, రైల్వే వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కూడా నీటి సరఫరా ఆగిపోయింది. గత 30 గంటలుగా పంపింగ్ వ్యవస్థ పూర్తిగా స్తంభించడంతో, ఏలేరు, తాటిపూడి, గోస్తని, గంభీరం, రైవాడ కెనాల్స్ నుంచి వచ్చే నీటిని ఉద్యోగులు నిలిపివేశారు. జీవీఎంసీ పరిధిలోని అన్ని నీటి ట్యాంకులు ఖాళీ అయినట్లు సమాచారం. వీటిని తిరిగి నింపడానికి కనీసం 10 గంటల సమయం పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

సమ్మెకు దిగిన జీవీఎంసీ వాటర్ సప్లై ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, తమ జీతాలు పెంచాలని, ఉద్యోగ భద్రతను కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. గత రాత్రి మేయర్ పీలా శ్రీనివాస్‌తో జరిగిన చర్చలు విఫలమవడంతో, సమ్మె కొనసాగుతోంది. జీవీఎంసీ అధికారులు సచివాలయ ఉద్యోగులను ట్యాంకుల నిర్వహణ, నీటి సరఫరా కోసం ఉపయోగించాలని ప్రయత్నిస్తున్నారు, కానీ ఈ చర్య సాంకేతిక సమస్యలకు దారితీస్తుందని సమ్మెలో ఉన్న ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. నగరంలోని 98 వార్డుల్లో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు జీవీఎంసీ అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. సమ్మెలో ఉన్న ఉద్యోగులు మరోసారి మేయర్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నారు, కానీ చర్చలు సఫలం కాకపోతే నీటి సరఫరాను పునరుద్ధరించేందుకు ఎటువంటి హామీ ఇవ్వడం లేదు. స్థానిక ప్రజలు, ముఖ్యంగా నగరంలోని అనేక కాలనీలలో నివసిస్తున్నవారు, తాగునీటి కొరతతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ ఘటన జీవీఎంసీ పరిధిలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైనందుకు ప్రభుత్వంపై విమర్శలను రేకెత్తిస్తోంది. ప్రస్తుత పరిస్థితి నగరవాసులకు ఆందోళన కలిగిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment