విశాఖపట్నంలో(Visakhapatnam) రోడ్డు పనులు (Road Works) జరుగుతున్న ప్రాంతంలో భారీగా మృతదేహాలు(Dead Bodies, పుర్రెలు (Skulls) బయటపడటం తీవ్ర కలకలం రేపింది. షీలానగర్ నుంచి పోర్టుకు వెళ్లే మార్గంలో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు (Greenfield Road) పనుల్లో భాగంగా మట్టి డంపింగ్ (Soil Dumping) చేయగా తొలుత మూడు మృతదేహాలు కనిపించాయి. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న గాజువాక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రాత్రి సమయంలో తీసుకొచ్చి డంప్ చేసిన మట్టిని పూర్తిగా పరిశీలించగా.. అందులో మరో రెండు మృతదేహాలు బయటపడ్డాయి. మొత్తం మట్టిని తవ్వి పరిశీలించిన క్రమంలో నాలుగు మృతదేహాలు, తొమ్మిది పుర్రెలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
బయటపడిన మృతదేహాలు (Dead Bodies) పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాలతో పాటు దిండు, దుప్పటి వంటి వస్తువులు కూడా కనిపించాయి. తొలుత ఓ పురుషుడి, ఓ మహిళ మృతదేహాలు కనిపించగా.. మట్టిని మరింత లోతుగా తవ్వడంతో మరో రెండు మృతదేహాలు, తొమ్మిది పుర్రెలు బయటపడినట్లు పోలీసులు తెలిపారు.
మృతదేహాలు, పుర్రెలు బయటపడిన ప్రాంతానికి రాత్రి సమయంలో తీసుకొచ్చి డంప్ చేసిన మట్టిపైనే పోలీసులు(Police) ప్రధానంగా దృష్టి సారించారు. ఈ మట్టిని ఏ ప్రాంతం నుంచి తీసుకొచ్చారు? దానికి సంబంధించిన వివరాలు ఏమిటి? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ప్రాథమికంగా ఈ మట్టిని శ్మశానం నుంచి తీసుకొచ్చి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మృతదేహాలు, పుర్రెలు నిజంగా ఎక్కడివి? అవి ఎప్పటివి? అనే విషయాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఘటనపై గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మట్టి తరలించిన వాహనాలు, డ్రైవర్లు, కాంట్రాక్టర్ వివరాలతో పాటు మట్టిని ఏ ప్రాంతం నుంచి తీసుకొచ్చారనే అంశాలపై ఆరా తీస్తున్నారు.
బయటపడిన మృతదేహాలు, పుర్రెలకు సంబంధించిన వివరాలను గుర్తించేందుకు పోలీసులు తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. అవసరమైతే ఫోరెన్సిక్ పరీక్షలు(Forensic Tests), డీఎన్‌ఏ పరీక్షల (DNA Tests) ద్వారా మృతుల వివరాలను గుర్తించే అవకాశం ఉంది.
షీలానగర్ రోడ్డు పనుల్లో భాగంగా డంప్ చేసిన మట్టిలో ఏకంగా నాలుగు మృతదేహాలు, తొమ్మిది పుర్రెలు బయటపడటంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.








