బోటు ప్ర‌మాదం.. స‌ముద్రంలో 15 కి.మీ ఈదిన మ‌త్స్య‌కారుడు

బోటు ప్ర‌మాదం.. స‌ముద్రంలో 15 కి.మీ ఈదిన మ‌త్స్య‌కారుడు

Summarize with AI

విశాఖ (Visakhapatnam) తీరంలో జరిగిన ఆ బోటు ప్రమాదం (Boat Accident) కేవలం ఒక ప్రకృతి విపత్తు కాదు… సముద్రమంత లోతైన ఒక అన్నదమ్ముల బంధానికి, గుండెల్ని పిండేసే త్యాగానికి సజీవ సాక్ష్యం. త‌న కోసం ఎదురుచూస్తున్న కుటుంబాన్ని చేరుకోవాల‌ని రాకాసి అల‌ల‌కు ఎదురెళ్లిన మ‌త్స్య‌కారుడి వీరోచిత పోరాటం.. మృత్యువు ముఖద్వారం వరకు వెళ్లి, ప్రాణాలతో తిరిగి వచ్చిన భోగాపురం (Bhogapuram) మత్స్యకారుడు కారె చిన్న చెప్పిన కథనం వింటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు.

ప్రకృతి ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ ఊహించలేరు. రెండు రోజుల పాటు సంతోషంగా సాగిన వేట, ఇంటికి తిరుగు ప్రయాణమయ్యే సరికి నరకంగా మారింది. తీరానికి కేవలం 10 మైళ్ల దూరంలో ఉండగా ఒక్కసారిగా వచ్చిన రాకాసి అల బోటును తలకిందులు చేసింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మత్స్యకారులు గల్లంతుకాగా, ప్రాణాలతో బయటపడిన భోగాపురం మత్స్యకారుడు కారె చిన్న చెప్పిన మాటలు క‌న్నీళ్లు తెప్పిస్తోంది. సముద్రంలో మరణంతో చేసిన పోరాటాన్ని, తన ప్రాణాల కోసం తమ్ముడు చేసిన త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ కన్నీరుమున్నీరయ్యాడు.

జూలై 1న హార్బర్ నుంచి వేటకు వెళ్లిన తమ బృందం రెండు రోజుల పాటు చేపల వేట పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణం ప్రారంభించిందని చిన్న తెలిపాడు. తీరం చేరుకోవడానికి మరో 10 మైళ్లు మాత్రమే మిగిలి ఉండగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయిందని, భారీ గాలులు, రాక్షస అలలు బోటును ముంచెత్తాయని చెప్పాడు. ఒక భారీ అల బోటును బోల్తా (Boat Capsize) కొట్టేసిన క్షణంలోనే తన అన్నయ్య కుమారుడు సముద్రంలో పడిపోయాడని, అతడిని కాపాడేందుకు అన్నయ్య కూడా నీళ్లలోకి దూకడంతో ఇద్దరూ తన కళ్ల ముందే అలల్లో కలిసిపోయారని ఆవేదన వ్యక్తం చేశాడు.

బోటు మునిగిపోతుండటంతో మిగిలిన ఆరుగురు రెండు లైఫ్ బాయ్‌లను పట్టుకుని రాత్రంతా సముద్రంలో తేలియాడుతూ గడిపారని చిన్న(Chinna) తెలిపాడు. “విడిపోతే ఎక్కడో చనిపోతాం… అందరం కలిసే ఉండాలి” అంటూ ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకున్నామని గుర్తు చేసుకున్నాడు. అయితే తెల్లవారేసరికి మరో వ్యక్తి కనిపించకుండా పోయాడని, అప్పటికి ఐదుగురు మాత్రమే మిగిలారని చెప్పాడు.

ఉదయం దూరంలో ఒక చైనా వాణిజ్య నౌక కనిపించడంతో అక్కడికి ఈదుకెళ్లాలని తమ్ముడిని పిలిచానని చిన్న తెలిపాడు. కానీ తీవ్రంగా నీరసించిన తమ్ముడు మాత్రం.. “నా వల్ల ఇక ఈదడం కాదు… నువ్వు నలుగురు పిల్లల తండ్రివి. నువ్వైనా బతుకు…” అంటూ తనను ముందుకు పంపాడని చెప్పి చిన్న భావోద్వేగానికి గురయ్యాడు.

తాను ఈదుకుంటూ వెళ్తుండగా వెనక నుంచి “నేను కూడా వస్తాను… మీరు వెళ్లండి” అంటూ ధైర్యం చెప్పిన తమ్ముడు.. కొద్దిసేపటికే అలల్లో కనుమరుగయ్యాడని కన్నీటి పర్యంతమయ్యాడు. తనతో పాటు ఈదిన మిగిలిన ముగ్గురు కూడా అలల్లో కొట్టుకుపోయారని, చివరకు తాను ఒక్కడినే మిగిలానని చిన్న తెలిపాడు. దాదాపు 15 కిలోమీటర్లు మృత్యువుతో పోరాడుతూ ఈదిన అనంతరం చైనా షిప్‌ను చేరుకుని దాని యాంకర్ గొలుసును పట్టుకున్నానని వివరించాడు.

పెద్ద అలతో కిందపడిపోవడంతో గట్టిగా సహాయం కోసం కేకలు వేయగా, నౌకలోని చైనా సిబ్బంది తనను గుర్తించి లైఫ్ జాకెట్, తాడు విసిరి పైకి లాగారని తెలిపాడు. అనంతరం నీరు, ఆహారం ఇచ్చి సంరక్షించారని, భారత నౌకాదళ హెలికాప్టర్ వచ్చే వరకు షిప్‌లోనే ఉంచారని చెప్పాడు.

“నేను ఈ రోజు బతికున్నానంటే అది నా తమ్ముడు పెట్టిన భిక్షే. నన్ను బతకమని తానే సముద్రంలో కలిసిపోయాడు. ఆ క్షణం జీవితాంతం మరచిపోలేను” అంటూ చిన్న రోదించిన తీరు ఆస్పత్రిలో ఉన్నవారినే కాదు, ఈ ఘటన గురించి తెలిసిన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment