తెలంగాణలో(Telangana) ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా చేపట్టిన ఎన్యూమరేషన్ ఫారాల (Enumeration Forms) పంపిణీ కార్యక్రమం నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సి. సుదర్శన్‌రెడ్డి (C. Sudarshan Reddy) జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రక్రియ పురోగతిని సమీక్షించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 3.13 కోట్ల ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయగా, మొత్తం లక్ష్యంలో 92 శాతం పంపిణీ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. అదే సమయంలో అందిన ఫారాల్లో ఇప్పటివరకు సుమారు 9 శాతం మాత్రమే డిజిటలైజేషన్ (Digitalization) పూర్తయిందని సమావేశంలో వెల్లడైంది.
డిజిటలైజేషన్ ప్రక్రియ ఆశించిన వేగంతో సాగకపోవడంపై సీఈవో సుదర్శన్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా బూత్ లెవల్ అధికారులు (BLOలు) విధుల నిర్వహణలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. అవసరమైతే మరోసారి BLOలకు ప్రత్యేక శిక్షణ నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
అలాగే అందిన అన్ని ఎన్యూమరేషన్ ఫారాలను ఈ నెల 24వ తేదీలోపు పూర్తిగా డిజిటలైజ్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, సమయపాలనతో పూర్తి చేయాలని అధికారులకు సీఈవో సూచించారు.








