తమిళనాడులో(Tamil Nadu) విజయ్ ప్రభంజనం కొనసాగుతోంది. టీవీకే పార్టీ (TVK Party) అగ్రపథంలో దూసుకుపోతుండటంతో ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తులు మొదలయ్యాయి. ఈ క్రమంలో విజయ్ తండ్రి (Vijay’s father) ఎస్.ఎ. చంద్రశేఖర్ (S. A. Chandrasekhar) మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ మద్దతు కోరుతూ..
ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం టీవీకే పార్టీకి మెజారిటీ దక్కే అవకాశాలు ఉన్నప్పటికీ, సుస్థిర ప్రభుత్వం కోసం కాంగ్రెస్‌తో (Indian National Congress) కలిసి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన సంకేతాలిచ్చారు. “మేము కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. కాంగ్రెస్ మద్దతును మేము కోరుతున్నాం” అని ఆయన ప్రకటించారు. విజయ్ తండ్రి చేసిన ఈ ప్రకటన ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
విజయ్‌పై అపార నమ్మకం
విజయ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ విజయం వరకు ఆయన పడ్డ కష్టాన్ని చంద్రశేఖర్ గుర్తుచేసుకున్నారు.”విజయ్ ఖచ్చితంగా సీఎం అవుతానని మొదటి నుంచీ చాలా నమ్మకంతో ఉన్నాడు. ఆ నమ్మకమే ఈరోజు ఫలితాల్లో కనిపిస్తోంది” అని అన్నారు. ఎన్నికల్లో తన గెలుపుపై విజయ్‌కు ఒక్క శాతం కూడా సందేహం లేదని, తన శక్తిని తాను నమ్ముకున్నాడని చంద్రశేఖర్ చెప్పారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా, సింగిల్‌గా బరిలోకి దిగి ఈ స్థాయి ఫలితాలు సాధించడం మామూలు విషయం కాదని కొనియాడారు.
చారిత్రాత్మక విజయం
తమిళనాడులో దశాబ్దాలుగా ఉన్న ద్విముఖ పోరాటాన్ని పటాపంచలు చేస్తూ, ఒక నూతన పార్టీ ఈ స్థాయిలో ఆధిక్యంలో ఉండటం చారిత్రాత్మకమని ఆయన పేర్కొన్నారు. “ఇది కేవలం విజయ్ విజయం మాత్రమే కాదు, మార్పు కోరుకున్న తమిళ ప్రజల విజయం” అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం టీవీకే దాదాపు 110 కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మేజిక్ ఫిగర్ (118) చేరుకోవడానికి మరికొన్ని స్థానాల దూరంలో ఉన్న తరుణంలో, చంద్రశేఖర్ కాంగ్రెస్ మద్దతు కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది.








