చట్టాన్ని (Law) రక్షించాల్సిన (Protect) వారే చేతుల్లోకి తీసుకుంటే ఎంత నేరమో.. పెద్ద చదువులు చదివి, ఉన్నత స్థాయి కుర్చీలు ఎక్కిదిగొచ్చిన మేధావులకు తెలియంది కాదు. ఒక మనిషి ప్రాణం తీయడం ఎంత ఘోరమైన చర్యో దేశంలోని అత్యున్నత న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు వారికి తెలియనివి కావు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) తాజాగా జరిగిన ఒక ఘోర, దారుణమైన సంఘటన మాత్రం ఆ మేధావుల కంటికి కనిపించకపోవడం శోచనీయం. విజయవాడలో (Vijayawada) జరిగిన లాకప్ డెత్ (Lockup Death) ఉదంతంపై రాష్ట్రంలోని మేధావుల నోర్లు ఎందుకు పెగలడం లేదని నెటిజన్లు, విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
ఎన్నికల ముందు తటస్థ మేధావి వర్గంగా ప్రకటించుకొని కొందరు పెద్దలు పనిగట్టుకుని మరీ అప్పటి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారని, రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోందంటూ, ప్రజాస్వామ్యం (Democracy) ఖూనీ చేశారని, నిరసన హక్కులను కాలరాశారని ప్రచారం చేశారని గుర్తుచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతిభద్రతల (Law and Order) సమస్యలు తలెత్తుతున్నా, లాకప్ డెత్ లాంటి దారుణాలు జరుగుతున్నా వారు ఎందుకు స్పందించడం లేదనే చర్చ నడుస్తోంది.
మాజీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు పీవీ రమేష్ (P. V. Ramesh), ఎల్వీ సుబ్రహ్మణ్యం (L. V. Subrahmanyam), రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh Kumar) వంటి ప్రముఖులు గతంలో అనేక ప్రజా అంశాలపై తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం విజయవాడ లాకప్‌డెత్ వంటి వివాదాస్పద ఘటనపై వారు ఇప్పటివరకు ఎలాంటి బహిరంగ స్పందన ఇవ్వకపోవడం గమనార్హం.
ముఖ్యంగా తిరుపతి లడ్డూ (Tirupati Laddu) అంశంపై టీవీ డిబేట్లకు హాజరై మరీ ఆరోపణలు, వివరణలు ఇచ్చిన ఎల్వీ సుబ్రహ్మణ్యం (L. V. Subrahmanyam) లాంటి మేధావులు, బందిపోటు పాలన అని గత ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన పీవీ రమేష్ (P. V. Ramesh) లాంటి వ్యక్తులకు రాష్ట్రంలో జరుగుతున్న దమనకాండపై, లా అండ్ ఆర్డర్ (Law and Order) వైఫల్యాలపై తమ గొంతు ఎందుకు విప్పడం లేదని విశ్లేషకులు నిలదీస్తున్నారు.
గతంలో ఉచితాలు వద్దు, అప్పులు వద్దు అని స్టేట్‌మెంట్లు ఇచ్చిన వారు.. ఇప్పుడు కూటమి సర్కార్ (Coalition Government) ఎడాపెడా చేస్తున్న అప్పులపై ఎందుకు మాట్లాడటం లేదన్న ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో చట్టపరమైన, మానవ హక్కులకు సంబంధించిన కీలక అంశాలపై ఒకే ప్రమాణం ఉండాలని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీలు ఏవైనా న్యాయం విషయంలో అందరూ ఒకే విధంగా స్పందిస్తేనే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.
అప్పుల (Debt) లెక్కలు పెరిగిపోతున్నా, రైతుల(Farmers) కష్టాలు తీరకపోయినా, లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తున్నా.. వేటిపైనా మాట్లాడకుండా వీరంతా ఎక్కడికి వెళ్లారని సామాన్య ప్రజలు సైతం ప్రశ్నిస్తున్నారు. నాడు కేవలం ఒక రాజకీయ ప్రయోజనం కోసమే మేధావుల ముసుగులో కొందరు మాట్లాడారా? అనే అనుమానాలను ప్రస్తుత వారి మౌనం బలపరుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.








