విద్యాబుద్ధులు నేర్పించాల్సిన కళాశాల ప్రాంగణంలో లైంగిక వేధింపుల ఉదంతం కలకలం రేపుతోంది. విజయవాడలోని నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో విద్యార్థినులపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయన్న ఆరోపణలు నిజమేనని రాష్ట్ర మహిళా కమిషన్ ప్రాథమిక విచారణలో తేల్చింది. ఈ ఘటనపై విచారణ నివేదికను కమిషన్ ప్రభుత్వానికి సమర్పించింది.
ఏం జరిగింది?
కొంతకాలంగా కళాశాలలో వేధింపులు ఎదుర్కొంటున్న ఒక విద్యార్థిని ధైర్యం చేసి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేసింది. అయితే, దీనిపై యూనివర్సిటీ నియమించిన అంతర్గత విచారణ కమిటీ.. ఫిర్యాదుకు తగిన ఆధారాలు లేవని కేసును కొట్టేసింది. అంతేకాకుండా, ఫిర్యాదు చేసిన విద్యార్థినులను సదరు కమిటీ తిరిగి వేధింపులకు గురిచేయడం గమనార్హం.
మరో దారి లేక, బాధితురాలు మూడు రోజుల క్రితం నేరుగా ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్‌కు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు పంపింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన మహిళా కమిషన్ బృందం కళాశాలలో నేరుగా విచారణ చేపట్టింది.
మహిళా కమిషన్ విచారణలో షాకింగ్ నిజాలు
రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ నేతృత్వంలోని బృందం కళాశాలను సందర్శించి విద్యార్థినులు, ఫ్యాకల్టీని విడివిడిగా విచారించింది. కళాశాలలో లైంగిక వేధింపులు జరుగుతున్న మాట వాస్తవమేనని కమిషన్ గుర్తించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తూ విచారణ నివేదికను ప్రభుత్వానికి పంపినట్లు రాయపాటి శైలజ తెలిపారు.
చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో, విద్యా సంస్థల్లో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలు (ICC) సరిగా పనిచేయడం లేదని ఆమె అసహనం వ్యక్తం చేశారు. గతంలో నూజివీడులో కూడా ఇలాంటి ఘటనే వెలుగు చూసిందని గుర్తు చేశారు.
విద్యార్థినులకు భరోసా
“లైంగిక వేధింపులకు గురయ్యే మహిళలు, విద్యార్థినులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలి” అని రాయపాటి శైలజ పిలుపునిచ్చారు. ప్రస్తుతం జిల్లాల వారీగా పాష్ (POSH) యాక్ట్ పై అవగాహన కల్పిస్తున్నామని, వీటి వల్ల బాధితులు ఫిర్యాదు చేసేందుకు ధైర్యం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. కళాశాలలో చదువుకోవాల్సిన విద్యార్థినులు ఇలాంటి వేధింపులకు గురికావడంపై విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.








సీటు త్యాగం చేసిన వర్మకు సొంత పార్టీలోనే ‘షాక్’