లైన్ క్లియర్.. తమిళనాడు సీఎంగా విజయ్?

లైన్ క్లియర్.. తమిళనాడు సీఎంగా విజయ్?

తమిళనాడు రాజకీయాల్లో గత రెండ్రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడనుంది. మెజారిటీ మార్కును అందుకోవడంలో తడబడిన విజయ్ నేతృత్వంలోని TVK పార్టీకి ఎట్టకేలకు ఇతర పార్టీల నుంచి మద్దతు లభించింది. సూపర్ స్టార్ విజయ్ తన రాజకీయ అరంగేట్రంతోనే రికార్డు సృష్టించగా, ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన ‘మ్యాజిక్ ఫిగర్’ను సాధించారు. వామపక్షాలు, వీసీకే పార్టీలు విజయ్‌కు మద్దతు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ‘దళపతి’ పట్టాభిషేకానికి మార్గం సుగమమైంది.

118కి చేరిన బలం..
ఇటీవలి ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 118 సీట్లకు కేవలం 10 సీట్ల దూరంలో నిలిచింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ విజయ్‌కు మద్దతు ప్రకటించింది. రెండ్రోజుల స‌స్పెన్స్ త‌రువాత‌ తాజాగా సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీలు కూడా టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు అంగీకరించాయి. ఈ పార్టీల మద్దతుతో విజయ్ బలం 118కి చేరుకుంది. దీంతో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన పూర్తి మెజారిటీని ఆయన సంపాదించుకున్నారు.

గవర్నర్‌తో భేటీ.. కొలువుదీరనున్న సర్కార్
మద్దతు ఇస్తున్న పార్టీల ఎమ్మెల్యేల లేఖలతో విజయ్ ఈరోజు సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలవనున్నారు. తనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా ఆయన కోరనున్నారు. మరోవైపు, వామపక్షాలు మరికొద్ది సేపట్లో తమ మద్దతుపై అధికారిక ప్రకటన చేయనున్నాయి.

కేంద్రంపై టీవీకే నేతల ఆగ్రహం
తమ నేతను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, ముఖ్యంగా కేంద్రంలోని అధికార పార్టీ విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా తెరవెనుక రాజకీయాలు చేస్తోందని టీవీకే సభ్యులు ఆరోపిస్తున్నారు. “ప్రజాబలం ఉన్న విజయ్‌ను అడ్డుకోవడం ఎవరి తరమూ కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడనున్న ఈ ప్రభుత్వాన్ని ఎవరూ ఆపలేరు” అని వారు హెచ్చరిస్తున్నారు.

తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక సినిమా నటుడు సొంత పార్టీ పెట్టిన మొదటి ఎన్నికల్లోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం ఎంజీఆర్ తర్వాత మళ్ళీ ఇప్పుడే జరగనుందని అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment