హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ మాదాపూర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న 29 ఏళ్ల యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అర్చన చౌదరి మాలిక్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రనాయక్ తండాలో నివాసం ఉంటూ, మైండ్‌స్పేస్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది.
ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆమె తన గదిలో విగతజీవిగా కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఘటనకు ముందు అర్చన తన ప్రియుడు భండారి విమల్‌కు వీడియో కాల్ చేసినట్లు తెలుస్తోంది.
విమల్ పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున సుమారు 2:30 గంటల సమయంలో అర్చన వీడియో కాల్ చేసి, పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పినట్లు పేర్కొన్నాడు. అనంతరం కాల్ కట్ చేయడంతో ఆందోళనకు గురైన తాను పలుమార్లు ఫోన్ చేసినా స్పందన రాలేదని తెలిపాడు.
దీంతో తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో అర్చన నివాసానికి చేరుకోగా, తలుపులు లోపలి నుంచి గడియ పెట్టి ఉన్నాయని, ఎంత పిలిచినా స్పందించకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు వివరించాడు. పోలీసులు తలుపులు తెరిచి లోపలికి వెళ్లి చూడగా అర్చన మృతి చెంది కనిపించింది. విమల్‌కు ఇప్పటికే వివాహమైనట్లు, భార్య నుంచి విడాకులు తీసుకునే అంశం కూడా విచారణలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. అయితే, అర్చన మృతికి ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారణ కాలేదు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, సంబంధిత కాల్ వివరాలు సహా ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, దర్యాప్తు వివరాల ఆధారంగా మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.








