వైభవ్ సూర్యవంశీ తుఫాన్.. IPLలో కొత్త సిక్సర్ల కింగ్ వచ్చేశాడు!

వైభవ్ సూర్యవంశీ తుఫాన్.. IPLలో కొత్త సిక్సర్ల కింగ్ వచ్చేశాడు!

Summarize with AI

పిట్ట కొంచెం.. కూత ఘనం అన్న సామెతను అక్షరాలా నిజం చేస్తున్నాడు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi). కేవలం 15 ఏళ్ల వయసులోనే ప్రపంచ క్రికెట్ దిగ్గజాల రికార్డులను చెరిపేస్తూ “బేబీ బాస్”(Baby Boss)గా అభిమానుల హృదయాలను గెలుచుకుంటున్నాడు. ఐపీఎల్ 2026(IPL 2026) ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై(SRH) అతడు ఆడిన విధ్వంసక ఇన్నింగ్స్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు బాదిన వైభవ్.. SRH బౌలర్లను చిత్తు చేశాడు. 5 ఫోర్లు, 12 భారీ సిక్సర్లతో 334.48 స్ట్రైక్‌రేట్ నమోదు చేసిన అతడి తుఫాన్ ఇన్నింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్(RR) 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి క్వాలిఫయర్-2కు దూసుకెళ్లింది.

ఈ మ్యాచ్‌తో వైభవ్ సూర్యవంశీ ఎన్నో అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. 2012లో క్రిస్ గేల్ (Chris Gayle) నెలకొల్పిన ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక 59 సిక్సర్ల రికార్డును (Sixes Records) బద్దలు కొట్టి, ఈ సీజన్‌లోనే 65 సిక్సర్లు బాది కొత్త చరిత్ర సృష్టించాడు. అలాగే ఐపీఎల్ ప్లేఆఫ్ మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 12 సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా నిలిచాడు. పవర్‌ప్లేలోనే 490 పరుగులు చేసి మరో సంచలనం సృష్టించిన వైభవ్.. ఐపీఎల్ చరిత్రలో తొలి ఆరు ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు. అంతేకాదు.. ఒక ఐపీఎల్ సీజన్‌లో 600కు పైగా పరుగులు చేసిన తొలి టీనేజర్‌గా కూడా అరుదైన ఘనత సాధించాడు.

అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కూడా వైభవ్ కొత్త రికార్డు నమోదు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున యశస్వి జైస్వాల్ పేరిట ఉన్న 626 పరుగుల రికార్డును అధిగమించి ప్రస్తుతం 680 పరుగులతో టాప్‌లో నిలిచాడు. ఇక ఎలిమినేటర్ మ్యాచ్‌లో కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఐపీఎల్ ప్లేఆఫ్ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధశతకం రికార్డును సురేష్ రైనాతో సమం చేశాడు. ఒక ఇన్నింగ్స్‌లో మూడుసార్లు 10కి పైగా సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా నిలవడమే కాకుండా, మొత్తం టీ20 క్రికెట్‌లో నాలుగు సార్లు 10కిపైగా సిక్సర్లు బాది క్రిస్ గేల్ ఆల్‌టైమ్ రికార్డును (All-Time Record) సమం చేశాడు. ఈ ప్రదర్శనతో వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో భారత క్రికెట్‌కు సూపర్ స్టార్‌గా మారబోతున్నాడనే నమ్మకం అభిమానుల్లో మరింత పెరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment