తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams)లో జరిగిన పరకామణి చోరీ కేసు (Parakamani Theft Case)లో దాఖలైన నివేదికపై హైకోర్టు (High Court) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పరకామణిలో భక్తులు సమర్పించే కానుకలు పక్కదారి పట్టడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో అప్పట్లో పనిచేసిన పోలీసుల పాత్ర ఏమిటన్న అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం కోరుతూ హైకోర్టు కీలక ప్రశ్నలు వేసింది.
ఈ కేసులో కొందరు పోలీసులు నిందితులతో చేతులు కలిపారని ప్రభుత్వం కోర్టుకు తెలియజేయడంతో, వారిపై వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా, సంబంధిత పోలీసుల ఆదాయానికి మించిన ఆస్తులపై సీఐడీ ద్వారా సమగ్ర విచారణ జరపాలని స్పష్టం చేసింది. భక్తుల విశ్వాసానికి విఘాతం కలిగించే ఇలాంటి ఘటనలు అత్యంత తీవ్రమైనవని కోర్టు వ్యాఖ్యానించింది.
పరకామణి భద్రతకు సంబంధించి ప్రత్యామ్నాయ చర్యలు, విధానాలపై నిన్న హైకోర్టుకు టీటీడీ నివేదిక (TTD Report) సమర్పించింది. అయితే ఆ నివేదికలో సరైన ప్రత్యామ్నాయ విధానాలను స్పష్టంగా పేర్కొనలేదని న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత టీటీడీతో పాటు ప్రభుత్వానిదేనని హైకోర్టు గుర్తు చేసింది.
సరైన సూచనలు, సలహాలు లేకుండా కోర్టు ఎలా ఆదేశాలు జారీ చేయగలదని ప్రశ్నించిన హైకోర్టు, ఈ అంశంపై మరింత స్పష్టమైన వివరాలతో కొత్త నివేదికను సమర్పించాలని సూచించింది. పరకామణి చోరీ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.








