పార్లమెంట్ శీతాకాల సమావేశాలు తీవ్ర రాజకీయ వేడితో కొనసాగుతున్నాయి. గురువారం లోక్‌సభలో విక్సిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ బిల్–2025 ఆమోదం పొందింది. ఈ బిల్లును VB-G RAM G Bill లేదా “జీ రామ్ జీ బిల్లు”గా పిలుస్తున్నారు. అయితే ఈ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో పార్లమెంట్ ప్రాంగణం ఆందోళనలతో మార్మోగింది.
ఈ కొత్త చట్టం ద్వారా ఇప్పటివరకు అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA)ను తొలగించి, దాని స్థానంలో కొత్త ఉపాధి పథకాన్ని తీసుకువస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కొత్త బిల్లు ప్రకారం గ్రామీణ కుటుంబాలకు సంవత్సరానికి 125 రోజుల ఉపాధి హామీ, అలాగే కేంద్ర–రాష్ట్రాల నిధుల భాగస్వామ్యాన్ని 60:40 నిష్పత్తిలో అమలు చేయనున్నారు. దీనిని ఉపాధి పథకాల ఆధునికీకరణగా ప్రభుత్వం వివరిస్తోంది.
అయితే విపక్షాల వాదన పూర్తిగా భిన్నంగా ఉంది. గాంధీ పేరు తొలగించడం ద్వారా పథక ఆత్మను దెబ్బతీశారు, రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారం మోపుతున్నారు, గ్రామీణ పేదలకు ఇది నష్టం కలిగిస్తుంది” అంటూ విపక్ష నేతలు మండిపడ్డారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీలు నిరసనకు దిగారు. సగరికా ఘోష్, డెరెక్ ఓ’బ్రియన్, డోలా సేన్, సుస్మితా దేవ్ సహా పలువురు ఎంపీలు గురువారం రాత్రి పార్లమెంట్ కాంప్లెక్స్‌లోని సంవిధాన్ సదన్ మెట్లపై దాదాపు 12 గంటల పాటు ధర్నా చేపట్టారు. తీవ్రమైన చలిని సైతం లెక్కచేయకుండా అక్కడే నిద్రించారు.
మహాత్మా గాంధీని రెండోసారి హత్య చేశారు.. అనే నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ నిరసనను కొనసాగించారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని విపక్షాలు ప్రకటించడంతో, రానున్న రోజుల్లో ఈ అంశం రాజకీయంగా మరింత వేడెక్కే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.








