తిరుపతిలో(Tirupati) నకిలీ బంగారం తాకట్టు (Fake Gold Pledge) పెట్టి నగదు తీసుకుని పరారైన ఘటన కలకలం రేపింది. నగరంలోని మూడు తాకట్టు దుకాణాల్లో(Pawn Shops) దాదాపు 60 గ్రాముల నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టిన కేటుగాళ్లు మొత్తం రూ.5.24 లక్షలు తీసుకుని ఉడాయించినట్లు వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
లక్ష్మీపురం సర్కిల్‌లోని (Lakshmipuram Circle) భవాని పాన్ బ్రోకర్(Bhavani Pawn Broker), దేవేంద్ర పాన్ బ్రోకర్(Devendra Pawn Broker), ఎల్‌ఎస్ నగర్‌లోని (LS Nagar) శ్రీవినాయక కుదువ దుకాణంలో (Sri Vinayaka Pawn Shop)ఈ మోసం జరిగినట్లు తెలుస్తోంది. నిందితులు అంకిత(Ankitha), భాస్కర్ నాయుడు (Bhaskar Naidu) పేర్లతో ఉన్న ఆధార్ కార్డులను చూపించి ఆయా దుకాణాల్లో బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టినట్లు వ్యాపారులు తెలిపారు. హాల్‌మార్క్ గుర్తు ఉండటంతో వాటిని అసలైన బంగారంగా భావించిన దుకాణ యజమానులు నిబంధనల ప్రకారం నగదు చెల్లించి ఆభరణాలను తాకట్టు తీసుకున్నారు. అయితే ఆ తర్వాత బంగారం నాణ్యతను పరీక్షించడంతో అవి నకిలీవని తేలింది.
బంగారం నకిలీదని నిర్ధారణ కావడంతో తాకట్టు దుకాణాల యజమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే తాము తీసుకున్న ఆధార్ కార్డులు, దుకాణాల్లోని సీసీ కెమెరా ఫుటేజ్ తదితర వివరాలను సేకరించారు. వాటి ఆధారంగా నిందితులను గుర్తించి పట్టుకోవాలని పోలీసులను ఆశ్రయించారు. మూడు దుకాణాల్లోనూ ఒకే తరహాలో నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి నగదు తీసుకెళ్లడంతో ఈ వ్యవహారం పక్కా ప్రణాళికతో జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటనపై బాధిత వ్యాపారులు పోలీసులను ఆశ్రయించగా.. సీసీ ఫుటేజ్, ఆధార్ కార్డులు సహా అందుబాటులో ఉన్న ఆధారాలతో ఫిర్యాదు చేయాలని తిరుపతి అడ్మిన్ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు సూచించారు. ఫిర్యాదు ఆధారంగా నిందితులను గుర్తించి, మోసం వెనుక ఉన్న వ్యక్తులపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది.
తిరుపతిలో వరుసగా మూడు కుదువ దుకాణాలను టార్గెట్ చేసి నకిలీ బంగారంతో రూ.5.24 లక్షలు కాజేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ మోసం వెనుక మరెవరైనా ఉన్నారా? ఇదే తరహాలో ఇతర ప్రాంతాల్లోనూ మోసాలకు పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది.








