బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ వాయుగుండం ఇవాళ అర్ధరాత్రి లేదా రేపు తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్‌లోని కళింగపట్నానికి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరికలు జారీ అయ్యాయి. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేసింది. నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు, ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
మంగళవారం రాత్రి నాటికి వాయుగుండం కళింగపట్నానికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నానికి ఈశాన్యంగా 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. గంటకు 7 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న ఈ వ్యవస్థ ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో కళింగపట్నానికి సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. వంశధార, నాగావళి నదుల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను హెచ్చరించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఉత్తరాంధ్రలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించగా, పరిస్థితిని కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వర్షాల తీవ్రతను బట్టి మరిన్ని ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించే అవకాశం ఉంది.








‘సీట్లు బిచ్చం కావు’.. ‘స్థానిక’ వాటాపై పవన్ కీలక వ్యాఖ్యలు