తెలంగాణలో పెట్టుబడులకు భరోసా.. ఇన్వెస్టర్లకు సీఎం రేవంత్ ఆహ్వానం

తెలంగాణలో పెట్టుబడులకు భరోసా.. ఇన్వెస్టర్లకు సీఎం రేవంత్ ఆహ్వానం

Summarize with AI

ఢిల్లీలో నిర్వహించిన ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆహ్వానించారు. సుమారు 400 ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ అప్పటినుంచే ప్రపంచస్థాయి వాణిజ్య కేంద్రంగా వెలుగొందిందని, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, అడోబ్ సీఈవో శంతను నారాయణ్ వంటి ప్రముఖులకు ఈ నగరంతో విద్యాపరమైన అనుబంధం ఉందని గుర్తుచేశారు. మాజీ ప్రధానులు రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు దేశ అభివృద్ధికి చేసిన సేవలను ప్రస్తావిస్తూ, హైదరాబాద్‌ను అంతర్జాతీయ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దడంలో గత ప్రభుత్వాల కృషిని కొనియాడారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే ప్రతి ఒక్కరికీ భద్రత కల్పించడం, వారి వ్యాపారాలు అభివృద్ధి చెందేలా చూడడం తన బాధ్యతని భరోసా ఇచ్చారు.

2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ‘తెలంగాణ రైజింగ్ 2047’ ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-పుణె హైస్పీడ్ రైలు కారిడార్లు, రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి రాష్ట్ర ప్రగతికి దోహదపడతాయని పేర్కొన్నారు. హైదరాబాద్ ఇకపై ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాలతోనే కాకుండా న్యూయార్క్, లండన్, టోక్యో, సియోల్, దుబాయ్ వంటి అంతర్జాతీయ నగరాలతో పోటీ పడాలని ఆకాంక్షించారు. పెట్టుబడిదారుల ఆలోచనలను ప్రభుత్వ విధానాలుగా మార్చి, తెలంగాణను ప్రపంచస్థాయి ఆర్థిక శక్తిగా నిలబెట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment