టీడీపీ తీర్మానం.. మహిళలను మోసం చేయడమేనా..?

టీడీపీ తీర్మానం.. మహిళలను మోసం చేయడమేనా..?

మ‌హానాడు వేదిక‌గా మ‌హిళ‌ల కోసం టీడీపీ యువ‌నాయ‌కుడు ప్ర‌తిపాదించిన హామీపై క్షేత్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. కేంద్రం ఇచ్చినా, ఇవ్వ‌క‌పోయినా మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్ ఇస్తామ‌ని నారా లోకేష్ ప్ర‌క‌టించిన వాగ్దానంపై మోస‌పూరిత‌మైంద‌ని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ తన మహానాడు వేదికగా పార్టీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించడం అత్యంత హాస్యాస్పదమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు.

“2029 వరకు దేశంలో మహిళా రిజర్వేషన్లు అమలు కావనేది పచ్చి నిజం. కానీ, ఇప్పుడేదో ఇస్తామంటూ టీడీపీ చెబుతున్న మాటలు కేవలం మహిళలను మోసం చేయడానికే. రేపు ఎన్నికల్లో కచ్చితంగా ఓడిపోయే సీట్లను మాత్రమే మహిళలకు కేటాయించి 33 శాతం కోటాను భర్తీ చేస్తారు” అని శ్రీనివాస‌రావు ఆరోపించారు. ప్రధాని మోదీ చెప్పిన మాటలను నమ్ముతూ.. రాష్ట్ర ప్రభుత్వం అటు మహిళల ప్రయోజనాలను, ఇటు రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా గాలికొదిలేసిందని విమర్శించారు.

మున్సిపల్ శాఖలోని సేవలను ప్రైవేట్ పరం చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం. 970ను వెంటనే వెనక్కి తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మున్సిపల్ శాఖ పరిధిలోని సుమారు 14 రకాల సేవలను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించేందుకు వీలు కల్పించారని శ్రీనివాసరావు మండిపడ్డారు. ప్రభుత్వ సేవలను ప్రైవేట్ సంస్థలకు ఇస్తే, వారు యూజర్ చార్జీల పేరుతో ప్రజలపై వేల కోట్ల రూపాయల అదనపు భారాన్ని మోపుతారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ నిర్ణయం వల్ల మున్సిపల్ శాఖలో ఎన్నో ఏళ్లుగా నమ్ముకుని పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగుల ఉద్యోగ భద్రత పూర్తిగా ప్రశ్నార్థకంగా మారుతుందని హెచ్చరించారు. మున్సిపల్ అధికారాలన్నీ ప్రైవేట్ సంస్థల చేతికి వెళ్తే.. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి ప్రజాప్రతినిధులు గెలిచినా వారికి ఎలాంటి ఉపయోగం ఉండదని, స్థానిక స్వపరిపాలన నిర్వీర్యమవుతుందని విమర్శించారు.

ధరల పెరుగుదలపై సిపిఎం పోరాటం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచుతూ ప్రజలను ఏ విధంగా దోచుకుంటున్నాయో ప్రజలకు వివరిస్తామని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇందుకు వ్యతిరేకంగా త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ప్రచారాలు (క్యాంపెయిన్) నిర్వహిస్తామని, ప్రజలను చైతన్యపరిచి ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడతామని ఆయన పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment