ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా కడప, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా టీడీపీ అడ్డుకుంటోంది. దాడులకు పాల్పడటం, నామినేషన్ పత్రాలను చించివేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పాల్గొనాల్సిన అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తూ, ఎన్నికల ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ఈ ఘటనల్లో పోలీసుల వ్యవహారశైలిపైనా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడపలో వైసీపీ అభ్యర్థి నామినేషన్ పత్రాల చించివేత
కడప గాంధీనగర్ నామినేషన్ కేంద్రం వద్ద భారీగా టీడీపీ శ్రేణులు మోహరించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారు. కోటిరెడ్డి కాలేజీ వద్ద వైసీపీ అభ్యర్థి త్యాగరాజుపై దాడి చేసి, ఆయన నామినేషన్ పత్రాలను చించివేసారు. ఎన్నికల్లో పోటీ చేసే హక్కును అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వైసీపీ అభ్యర్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఎంపీ గురుమూర్తి సమక్షంలోనే నామినేషన్ పత్రాల ధ్వంసం
తిరుపతిలో వైసీపీ మేయర్ అభ్యర్థి వాసు యాదవ్ నామినేషన్ వ్యవహారంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆయన తరఫున ప్రపోజర్‌గా వెళ్లిన ఎంపీ గురుమూర్తిని నామినేషన్ కేంద్రం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. తాను ప్రపోజర్‌గా వచ్చానని ఎంపీ వివరించగా, పోలీసులు పత్రాలు చూపించాలని కోరినట్లు తెలుస్తుంది. ఎంపీ పత్రాలు చూపించిన వెంటనే వాటిని లాక్కుని టీడీపీ శ్రేణులు చించేసిన బరితెగింపుకు పాల్పడ్డారు. పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన జరగడం, నామినేషన్ పత్రాల ధ్వంసాన్ని అడ్డుకోవడంలో పోలీసులు విఫలమయ్యారన్న విమర్శలకు దారితీసింది. అధికార పార్టీ శ్రేణుల చర్యలకు పోలీసులు సహకరిస్తున్నారంటూ వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
అన్నమయ్య జిల్లా లో కారు ధ్వంసం
అన్నమయ్య జిల్లా రాయచోటిలోని మదనపల్లి రోడ్డులో మానస రెస్టారెంట్ వద్ద వైసీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి జిన్నా షరీఫ్‌పై టీడీపీ శ్రేణులు దాడికి యత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో ఆయన కారు ధ్వంసమైంది. అనంతరం పోలీసులు జిన్నా షరీఫ్‌ను సంబేపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ స్టేషన్ ను చుట్టుముట్టిన టిడిపి మూకలు. జిన్నా షరీఫ్‌ను సంబేపల్లి నుంచి కలకడకు, అక్కడి నుంచి గుర్రంకొండకు పోలీసులు తరలించినట్లు తెలుస్తోంది. మరోవైపు, మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి పట్టణంలోకి ప్రవేశించకుండా రింగ్ రోడ్డు పరిసరాల్లో టీడీపీ శ్రేణులు అడ్డంకులు సృష్టిస్తున్నరని వైసీపీ వర్గాలు తెలిపాయి.








