టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ భారత పురుషుల క్రికెట్ జట్టు సీనియర్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. అజిత్ అగార్కర్ కాంట్రాక్టును పునరుద్ధరించకూడదని బీసీసీఐ నిర్ణయించడంతో ఖాళీ అయిన ఈ పదవికి తన పేరును పరిశీలించాలని జాఫర్ కోరారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. భారత్ తరఫున 31 టెస్టులు ఆడిన 48 ఏళ్ల జాఫర్ 1,944 పరుగులు సాధించారు. ఇందులో ఐదు సెంచరీలు ఉన్నాయి. వెస్టిండీస్, పాకిస్థాన్ జట్లపై డబుల్ సెంచరీలు నమోదు చేశారు. 2000 నుంచి 2008 వరకు సాగిన టెస్టు కెరీర్లో 34.10 సగటుతో పరుగులు సాధించారు. వన్డేల్లో మాత్రం 2006లో రెండు మ్యాచ్‌లకే పరిమితమయ్యారు.
దేశవాళీ క్రికెట్లో వసీం జాఫర్‌కు అపారమైన అనుభవం ఉంది. రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లలో అగ్రస్థానంలో నిలిచిన ఆయన, ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 260 మ్యాచ్‌లు ఆడి 19,410 పరుగులు, 57 సెంచరీలు నమోదు చేశారు. 1996-97 సీజన్లో ముంబై తరఫున సీనియర్ క్రికెట్లో అరంగేట్రం చేసిన జాఫర్, అనంతరం విదర్భ జట్టుకు ప్రాతినిధ్యం వహించి అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికారు. ఆయన అనుభవం సెలెక్టర్ పదవికి కీలకంగా మారే అవకాశం ఉంది. క్రికెట్ అడ్వైజరీ కమిటీ (CAC) సభ్యులు అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపే ఆయన పేరును పరిగణనలోకి తీసుకుంటే, చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం సెలక్షన్ కమిటీలో ప్రజ్ఞాన్ ఓజా, ఆర్పీ సింగ్, అజయ్ రాత్రా, శివసుందర్ దాస్ సభ్యులుగా ఉన్నారు. ప్రజ్ఞాన్ ఓజా భారత్ తరఫున 24 టెస్టులు ఆడగా, జాఫర్ 31 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించారు.








