పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో నూతన అధ్యాయం మొదలైంది. మమతా బెనర్జీకి ఒకప్పుడు అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన సువేందు అధికారి ఇప్పుడు అధికారంలోకి అడుగుపెట్టారు. బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో వెలసిన చారిత్రక వేదికపై ఆయన బీజేపీ తరఫున రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆర్.ఎన్. రవి ఆయనతో ప్రమాణం చేయించగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులు ఈ వేడుకకు హాజరై ఘనతను చాటారు. జాతీయ గీతంతో కార్యక్రమం ప్రారంభమై, సువేందు అధికారి కాషాయ కుర్తాతో, ఎంతో నిరాడంబరంగా సభా వేదికపై కనిపించారు.
ఈ ప్రమాణ స్వీకార వేడుకకు బెంగాల్ సంస్కృతి తళుకెత్తేలా ప్రత్యేక సన్నాహాలు చేశారు. వేదిక వద్ద బెంగాలీ ప్రత్యేకతలతో కూడిన అలంకరణలు, నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ తత్వస్ఫూర్తి ప్రతిబింబించే కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 20 పైచిలుకు స్వీట్ల స్టాళ్లతో పాటు, సాంప్రదాయ ‘ఝల్మురీ’ బూత్‌లు సభకు రుచిని జోడించాయి. గతంలో ప్రధాని మోడీ ర్యాలీలో ఝల్మురీ రుచి చూసిన సంఘటన తర్వాత దీనికి విపరీతమైన క్రేజ్ రావడం గుర్తించదగ్గ విషయం.
మరి ముఖ్యంగా, ఈ వేడుకకు మే 9వ తేదీని ఎంచుకోవడం వెనుక ఉన్న వ్యూహం కూడా చర్చకు దారితీసింది. ఆ రోజు రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి కావడం, బీజేపీ బెంగాలీ సంస్కృతిపై గౌరవాన్ని చాటే ప్రయత్నంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ జన్మభూమిగా ఉన్న బెంగాలులో బీజేపీ అధికారం చేపట్టడం ఆ పార్టీకి చారిత్రక ఘట్టమని, దేశవ్యాప్త ఆరాధనను పొందిన వేడుకగా ఇది నిలిచిపోతుందనే విశ్లేషణ వినిపిస్తోంది.








