బీఆర్ఎస్ నేత దారుణ హత్యకు పాత‌క‌క్ష‌లే కార‌ణం (Video)

బీఆర్ఎస్ నేత దారుణ హత్యకు పాత‌క‌క్ష‌లే కార‌ణం

సూర్యాపేట (Suryapet) జిల్లా కేంద్రంలో కలకలం రేపిన బీఆర్ఎస్(BRS) నాయకుడు చింతలపాటి మధు (Chintalapati Madhu) హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ దారుణ హత్యకు పాతకక్షలు, ప్రతీకారమే కారణమని సూర్యాపేట ఎస్పీ నర్సింహ్మా (Narsimha) అధికారికంగా వెల్లడించారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన నిందితుల అరెస్ట్ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశామని, మరో మహిళ పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.

2007 హత్యకు ప్రతీకారంగా..
పోలీసుల కథనం ప్రకారం.. 2007లో యర్కారం గ్రామంలో అప్పటి మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నేత మిద్దె రవీందర్ (Midde Ravinder) హత్యకు గురయ్యారు. ఆ కేసులో చింతలపాటి మధు నిందితుడిగా ఉన్నారు. తన తండ్రి రవీందర్ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని అతని కుమారుడు మిద్దె జీవన్(Midde Jeevan) గత కొంతకాలంగా పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో గతంలోనే మధుపై రెండు సార్లు హత్యాయత్నం చేసినప్పటికీ అవి విఫలమయ్యాయి. ఈసారి ఎలాగైనా మధును అంతమొందించాలని పక్కా ప్లాన్ వేశారు.

చేపల కూరతో మద్యం పార్టీ..
ఈ ప్లాన్‌లో భాగంగానే నిందితులైన చింతా సైదులు (Chinta Saidulu), మేదరి ప్రసాద్‌లు (Medari Prasad) రంగంలోకి దిగారు. “ఇంట్లో చేపల కూర వండాను, పార్టీ చేసుకుందాం రా” అంటూ మధును సైదులు తన ఇంటికి పిలిపించాడు. శుక్రవారం సాయంత్రం సైదులు ఇంట్లోనే మధు, ప్రసాద్‌లతో కలిసి మద్యం పార్టీ జరిగింది. మధు పూర్తిగా మద్యం మత్తులోకి జారుకోగానే, సైదులు వెంటనే మిద్దె జీవన్‌కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు.

సమాచారం అందుకున్న వెంటనే జీవన్.. తన సోదరుడి వరసయ్యే ఆనంద్‌తో కలిసి మటన్ కొట్టే కత్తి తీసుకుని సైదులు ఇంటికి చేరుకున్నాడు. అనంతరం నిందితులు జీవన్, సైదులు ఇద్దరూ కలిసి నిద్రిస్తున్న మధుపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి, నరికి చంపారు. హత్య అనంతరం సాక్ష్యాలను మాయం చేసేందుకు మృతదేహాన్ని ఒక కారులో తరలించి, యర్కారం సమీపంలోని కల్వర్ట్ లో పడేశారు.

ఐదుగురు అరెస్ట్.. ఒకరు పరారీ
ఈ హత్యకు ప్లాన్ చేయడంలో, హంతకులకు ఆశ్రయం ఇవ్వడంలో చింతా సైదులు భార్య ముల్కలపల్లి భవానీ కూడా సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నారు. అరెస్ట్ అయిన నిందితులు మిద్దె జీవన్ (ప్రధాన సూత్రధారి), చింతా సైదులు, మేదరి ప్రసాద్, మిద్దె ఆనంద్, కక్కిరేణి భరత్ చంద్. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించడంతో పాటు వారి వద్ద నుండి హత్యకు ఉపయోగించిన కారు, ఒక బైక్, మరియు 5 మొబైల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment