బీఆర్ఎస్ నేత‌ దారుణ హత్య.. ముక్కలుగా నరికి బస్తాలో కుక్కిన దుండగులు!

బీఆర్ఎస్ నేత‌ దారుణ హత్య.. ముక్కలుగా నరికి బస్తాలో కుక్కిన దుండగులు!

సూర్యాపేట మండల పరిధిలోని యర్కారం గ్రామంలో రాజకీయ కక్షలు మరోసారి పడగవిప్పాయి. గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న గ్రామంలో పాత కక్షలు భగ్గుమనడంతో బిఆర్ఎస్ (BRS) పార్టీకి చెందిన కీలక నాయకుడు చింతలపాటి మధు (38) దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు ఆయనను కిడ్నాప్ చేసి, అత్యంత కిరాతకంగా ముక్కలుగా నరికి, శవాన్ని గోనె బస్తాలో కుక్కి పడేసిన ఉదంతం ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ ఘాతుకంతో యర్కారం గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

కారులో కిడ్నాప్.. మద్యం తాగించి మరీ హ‌త్య‌
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు, స్థానిక సమాచారం ప్రకారం.. దుండగులు మొదట చింతలపాటి మధును కారులో బలవంతంగా కిడ్నాప్ చేశారు. అక్కడ నుండి సూర్యాపేట తాళ్లగడ్డ శివారులోని జానయ్య అనే వ్యక్తి నివాసానికి తరలించారు. హత్యకు ముందు హంతక ముఠా అంతా కలిసి జానయ్య ఇంట్లో కూర్చొని మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం మధుపై విచక్షణారహితంగా దాడి చేసి, ప్రాణాలు తీశారు. చంపిన తర్వాత ఎవరికీ దొరకకుండా ఉండేందుకు మృతదేహాన్ని ముక్కలుగా నరికి, గోనె సంచిలో ప్యాక్ చేసి తిరిగి యర్కారం గ్రామ శివారు ప్రాంతంలో పడేసి పరారయ్యారు.

హత్య కేసులో సాక్షిగా ఉన్నందుకేనా..?
మధు హత్య వెనుక బలమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో గ్రామంలో జరిగిన ఒక హత్య కేసులో మధు కీలక సాక్షిగా (Witness) ఉన్నారు. ప్రస్తుతం ఆ కేసు కోర్టు విచారణ ముగింపు దశకు చేరుకుంది. సాక్ష్యం చెబితే తమకు శిక్ష పడుతుందనే కక్షతోనే ప్రత్యర్థులు కోర్టు విచారణ పూర్తి కాకముందే పక్కా స్కెచ్ వేసి మధును మట్టుబెట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు.

కాంగ్రెస్ నాయకులే చంపారు.. – బాధితుడి భార్య ఆరోపణ
హత్యకు గురైన చింతలపాటి మధు భార్య మౌనిక యర్కారం గ్రామ మాజీ సర్పంచ్‌గా పనిచేశారు. మధు హత్య వార్త తెలియగానే ఆమె గుండెలవిసేలా రోదించారు. రాజకీయ కక్షల వల్లే తన భర్తను పొట్టనబెట్టుకున్నారని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ (Congress) పార్టీకి చెందిన స్థానిక నాయకులు, కార్యకర్తలే పథకం ప్రకారం తన భర్తను కిడ్నాప్ చేసి దారుణంగా చంపేశారని మౌనిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

మధు దారుణ హత్య విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి తక్షణమే సూర్యాపేటలోని బాధితుడి నివాసానికి చేరుకున్నారు. మధు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు.

Join WhatsApp

Join Now

Leave a Comment